ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై పోరుకు వైసిపి సిద్ధమవుతోంది. కోటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలకు జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 27వ తేదీన, వచ్చే నెల మూడో తేదీన ఆందోళనలో నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే రైతాంగ సమస్యలపై ఒక నిరసన కార్యక్రమాన్ని వైసిపి నిర్వహించింది. వచ్చే నెల మూడో తేదీన విద్యార్థుల సమస్యలపై జగన్ నిరసనలకు పిలుపునిచ్చారు. వరుసగా ప్రజా సమస్యలపై పోరాటాలకు వైసిపి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై పోరుకు వైసిపి సిద్ధమవుతోంది. కోటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలకు జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 27వ తేదీన, వచ్చే నెల మూడో తేదీన ఆందోళనలో నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే రైతాంగ సమస్యలపై ఒక నిరసన కార్యక్రమాన్ని వైసిపి నిర్వహించింది. వచ్చే నెల మూడో తేదీన విద్యార్థుల సమస్యలపై జగన్ నిరసనలకు పిలుపునిచ్చారు. వరుసగా ప్రజా సమస్యలపై పోరాటాలకు వైసిపి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు గడిచి ఆరు నెలలు కాకముందే వైసిపి కార్యకర్తలను, నాయకులను రోడ్లపైకి వెళ్ళమనడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గడచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నాయకులు, కార్యకర్తలకు అధికారాలు లేకుండా చేయడంతో పాటు ఆర్థికంగాను నష్టపోయేలా జగన్మోహన్ రెడ్డి చేశారన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా నష్టపోయి, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందులను కొని తెచ్చుకోవడం పట్ల వారంతా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ తరహా నిరసన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఆర్థికంగా మరింత ఇబ్బందులను నాయకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారంగా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే జగన్ ఆలోచించాల్సిన అవసరం ఉందని నాయకులు చెబుతున్నారు. ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహించాలంటే కనీసంలో కనీసం 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఈ మొత్తాన్ని ఆయా జిల్లాలో భరించే నాయకులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించే ముందు పార్టీ నాయకుల ఆలోచనలు తెలుసుకోవడంతో పాటు సలహాలను పాటించాలని పలువురు సూచిస్తున్నారు.
ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఉన్న నాయకులు, కార్యకర్తలు మరింత ఇబ్బందులకు గురయ్యేలా ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయడం పట్ల క్యాడర్ అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. రానున్న రోజుల్లో ఆర్థికంగా భారాన్ని కలిగిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. తాడేపల్లి లో జగన్ మోహన్ రెడ్డి కూర్చుని కేడర్కు ఇలాంటి పిలుపులు ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. క్యాడర్ కు ఇబ్బందులు కలిగే వ్యవహారాలకు దూరంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. కనీసం ఏడాదిపాటైన ఈ ప్రభుత్వానికి సమయాన్ని ఇవ్వడం ద్వారా ప్రజలే వైఫల్యాలను గుర్తించి రోడ్లపైకి వస్తారని, అప్పుడు దానిని క్యాష్ చేసుకునేందుకు వైసిపి సిద్ధంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ఆరు నెలల గడవక ముందే రోడ్లపైకి నాయకులు కార్యకర్తలు రావడం వల్ల ఆర్థికంగా భారం కలగడంతోపాటు.. ప్రజల్లో కూడా ఒక రకమైన భావన ఏర్పడేందుకు అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు.