ప్రపంచంలోని ఏడు వింతల్లో ఈజిప్టు పిరమిడ్లు ఒకటి. అత్యద్భుత నిర్మాణాల్లో వీటిని ప్రత్యేక స్థానం. ఆకాశాన్ని తాకేలా ఉండే ఈ పిరమిడ్లను ఎలా కట్టారు? అంటే ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
ఈవార్తలు, కైరో: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఈజిప్టు పిరమిడ్లు ఒకటి. అత్యద్భుత నిర్మాణాల్లో వీటిని ప్రత్యేక స్థానం. ఆకాశాన్ని తాకేలా ఉండే ఈ పిరమిడ్లను ఎలా కట్టారు? అంటే ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అసలు అంత భారీ రాళ్లు ఎలా ఎత్తుకొచ్చారు? వాటిని ఎలా తరలించారు? తరలింపునకు ఎలాంటి సాధనాలు వాడారు? అన్న ప్రశ్నలకు జవాబులు తేల్చేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఎట్టకేలకు ఆ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. నైలు నది వల్లే ఇంత భారీ నిర్మాణం కట్టినట్లు తాజాగా గుర్తించారు. అసలు వివరాల్లోకి వెళితే.. నైలు నది పాయ ఒకటి 31 పిరమిడ్ల పక్క నుంచే ప్రవహించేదట.
ఈ పాయ ద్వారానే భారీ బండరాళ్లను రవాణా చేసినట్లు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకులు గుర్తించారు. ఆ పాయ వేల ఏళ్ల క్రితమే మరుగునపడిపోయిందని, భూమిలో పూడుకుపోయిందని తేల్చారు. దాదాపు 4,700 ఏళ్ల నుంచి 3,700 ఏళ్ల క్రితం గొలుసుకట్టు ఆకృతిలో ఈ పిరమిడ్లను నిర్మించారని వెల్లడించారు. ఆ పాయ పేరు అర్హామత్ అని.. దాని తీరంలో పిరమిడ్లను నిర్మించేందుకు కాజ్ వే ఏర్పాటు చేసినట్లు వివరించారు. పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించిన భారీ బండరాళ్లు, ఇతర సామగ్రి ఈ పాయ ద్వారా తరలించారనటానికి ఆ కాజ్ వేలు నిదర్శనమని పేర్కొన్నారు.