భారతదేశ జనాభా 2060 నాటికి 170 కోట్లకు చేరుకుంటుందని, అప్పటిదాకా జనాభా పెరుగుదల కనిపిస్తూనే ఉంటుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
జెనీవా : భారతదేశ జనాభా 2060 నాటికి 170 కోట్లకు చేరుకుంటుందని, అప్పటిదాకా జనాభా పెరుగుదల కనిపిస్తూనే ఉంటుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 2060ల్లో జనాభా పెరిగి, అప్పటి నుంచి తగ్గడం మొదలవుతుందని వెల్లడించింది. అయినా, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టస్ 2024 (The World Population Prospects 2024 report) రిపోర్ట్‌ను విడుదల చేసింది. వచ్చే 50-60 ఏళ్లు ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంటుందని వివరించింది. ప్రస్తుతం (2024 ప్రకారం) జనాభా 820 కోట్లు ఉండగా, 2080ల నాటికి 1003 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఆ తర్వాత జనాభా పెరుగుదల క్షీణించి ఈ శతాబ్దం చివరి నాటికి 1002 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. గత ఏడాది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా గత ఏడాది చైనాను దాటేసిన భారత్.. తన స్థానాన్ని 2100 సంవత్సరం నాటికి ఇలాగే కొనసాగిస్తుందని నివేదిక వెల్లడించింది. ‘ఈ శతాబ్దం అంతా భారతదేశ జనాభా పెరుగుతూనే ఉంటుంది. శతాబ్దం చివర్లో 12 శాతం తగ్గే అవకాశం ఉంది’ అని నివేదికలో యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం 145 కోట్లుగా ఉన్న భారత జనాభా, 2054 నాటికి 169 కోట్లకు చేరుతుందని, 2100 నాటికి 150 కోట్లకు తగ్గుతుందని గణాంకాలతో సహా వివరించింది. అటు.. ప్రస్తుతం 141 కోట్లుగా ఉన్న చైనా జనాభా 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుందని.. 2100 నాటికి 63.3 కోట్లకు తగ్గిపోతుందని నివేదిక తెలిపింది. 2024 నుంచి 2054 మధ్య దాదాపు 20 కోట్ల మందిని కోల్పోతుందని వెల్లడించింది. ఆ తర్వాత జపాన్ (2 కోట్లు) రష్యా (1 కోటి) మంది ప్రజలను కోల్పోతాయని పేర్కొంది.