ఆస్ట్రాజెనెకా మరో నిర్ణయం తీసుకుంది. సంస్థ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్లను వెనక్కి తీసుకుంటున్నది. ఈ మేరకు చర్యలు చేపట్టింది కూడా. కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోవటం, మిగులు డోసులు ఉండటంతోనే వ్యాక్సిన్లను వెనక్కి రప్పించుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.
ఈవార్తలు, న్యూఢిల్లీ: కరోనా తర్వాత చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా ఎంతోమంది ప్రాణాలు విడిచారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలతో అసువులుబాసారు. అయితే, ఈ మరణాలకు, వ్యాక్సిన్‌కు సంబంధం లేదని వైద్య నిపుణులు వాదిస్తూ వచ్చారు. అయితే, కొవిషీల్డ్ వాక్సిన్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, దాని తయారుచేసిన కంపెనీ ఆస్ట్రాజెనెకా చెప్పడం సంచలనం రేపటంతో ఒక్కసారిగా యావత్తు ప్రపంచం ఉలిక్కి పడింది. ‘కొవిషీల్డ్‌తో ఆరోగ్యసమస్యలు తలెత్తింది నిజమే.. చాలా అరుదైన కేసుల్లోనే రక్తం గడ్డ కట్టడం, ప్లేట్‌లెట్ల కౌంట్ తగ్గిపోవటం లాంటి సమస్యలు వచ్చాయి’ అని ఆస్ట్రాజెనెకా షాక్ ఇచ్చింది.
అయితే, ఈ సమయంలో ఆస్ట్రాజెనెకా మరో నిర్ణయం తీసుకుంది. సంస్థ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్లను వెనక్కి తీసుకుంటున్నది. ఈ మేరకు చర్యలు చేపట్టింది కూడా. కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోవటం, మిగులు డోసులు ఉండటంతోనే వ్యాక్సిన్లను వెనక్కి రప్పించుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ఇక నుంచి వినియోగానికి అనుమతి లేదని యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆ సంస్థకు నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఆస్ట్రాజెనెకా.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేసింది. కొవిషీల్డ్ పేరుతో ఇక్కడ, వాక్స్‌జెర్వియా పేరుతో యూరప్‌లో ఆస్ట్రాజెనెకా విక్రయాలు జరిపింది. అయితే, ఈ వ్యాక్సిన్లతో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రకటించిన.. కొన్నిరోజులకే వ్యాక్సిన్లను రిటర్న్ తీసుకోవటంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.