సోషల్ మీడియా దుష్ప్రభావాల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని సంకల్పించింది.
ప్రతీకాత్మక చిత్రం
మెల్‌బోర్న్, ఈవార్తలు : ఐదేళ్ల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఏ ఒక్కరిని తట్టినా స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. ఆ స్మార్ట్ ఫోన్ వల్ల సోషల్ మీడియా భారీగా విస్తరించింది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేవరకు.. వీలైతే నిద్రను త్యాగం చేసి ఫోన్‌ను గుడ్లగూబలా చూసేంతగా.. పరిస్థితి మారిపోయింది. చివరికి బాత్రూంకి వెళ్లినా ఫోన్ తీసుకొని వెళ్లే పరిస్థితులు దాపురించాయి. ఇక.. పిల్లలకు సోషల్ మీడియా ఒక వ్యసనంగా తయారైంది. ఫోన్ లేకపోతే ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి. ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినబోమని మారాం చేయడం.. ఫోన్ కోసం ఏడవటం.. లాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. దాంతో పిల్లలు చదువుతో పాటు.. వ్యాయామం వంటి శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. ఆరోగ్యం దెబ్బతింటోంది.
సోషల్ మీడియా దుష్ప్రభావాల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని సంకల్పించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అంటోనీ అల్బనీస్ గురువాం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. పిల్లల భద్రత నేపథ్యంలో తాము ఈ చర్యలకు దిగాల్సి వస్తోందని తెలిపారు. తాము తీసుకొనే నిర్ణయం పిల్లలకు, తల్లిదండ్రులకు మేలు చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంతో ఇన్‌స్టా్గ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై ప్రభావం పడనుంది.
16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చూడటం ఆయా సంస్థలు, టెక్ కంపెనీలదే బాధ్యత అని.. తల్లిదండ్రులది కాదని అల్బనీస్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వల్ల పిల్లలకు మంచి కంటే హాని ఎక్కువగా జరుగుతోదని.. పిల్లల భద్రతపై ఇప్పటికే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలే బాధ్యత తీసుకొనేలా చట్టం చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెలలోనే సంబంధిన చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని తెలిపారు. తాము తీసుకోబోయే నిర్ణయం ఒక్క ఆస్ట్రేలియాతోనే ఆగిపోదని.. ఆస్ట్రేలియాతో మొదలై.. ఇతర దేశాలకు విస్తరిస్తుందని పేర్కొన్నారు.