వైసిపికి పనిచేసేందుకు మళ్లీ ఐ ప్యాక్ సిద్ధమవుతోంది. 2019 ఎన్నికలకు ముందు నుంచి ఈ టీమ్ వైసీపీ కోసం పనిచేస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలం, బలహీనతలు వంటి అంశాలను గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు మార్చుకునేలా ఈ టీమ్ అధినేతకు నివేదికను సమర్పిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం తర్వాత ఈ టీమ్ ఖ్యాతి కూడా పెరిగింది. అయితే అనూహ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకోవడంతో ఐ ప్యాక్ సర్దేసింది.
ఐ ప్యాక్
వైసిపికి పనిచేసేందుకు మళ్లీ ఐ ప్యాక్ సిద్ధమవుతోంది. 2019 ఎన్నికలకు ముందు నుంచి ఈ టీమ్ వైసీపీ కోసం పనిచేస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలం, బలహీనతలు వంటి అంశాలను గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు మార్చుకునేలా ఈ టీమ్ అధినేతకు నివేదికను సమర్పిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం తర్వాత ఈ టీమ్ ఖ్యాతి కూడా పెరిగింది. అయితే అనూహ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకోవడంతో ఐ ప్యాక్ సర్దేసింది. దీంతో ఈ టీమ్ ఏపీలో ఇక అడుగుపెట్టదని అంత భావించారు. అయితే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అనూహ్యంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ సలహాదారుడుగా ఉన్న మోహన్ సాయి దత్ సూచనల మేరకు మళ్లీ ఐ ప్యాక్ టీమ్ ను జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఈ టీం క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా పార్టీలో ఉన్న లోపాలు, ఇబ్బందులను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని పార్టీ అధినేత భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత అనేక నియోజకవర్గాల్లో నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు బయటకు కూడా రావడం లేదు. దీనివల్ల పార్టీ క్యాడర్ నైరాశ్యంలో కూరుకుపోతోంది. ఇవన్నీ పార్టీకి ఇబ్బందికరంగా భావిస్తాయని భావించిన జగన్మోహన్ రెడ్డి.. ఈ తరహా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకునేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులను తెలుసుకునే ఉద్దేశంతో ఐ ప్యాక్ టీమ్ ను మరోసారి రప్పిస్తున్నట్లు చెబుతున్నారు. గడిచిన ఎన్నికలకు ముందు ఈ టీమ్ వాస్తవంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు సంబంధించిన నివేదికను జగన్మోహన్ రెడ్డికి అందించినప్పటికీ ఆయన దానిని తిరస్కరించారు. మనం అధికారంలోకి వస్తున్నాం అంటూ వారితో చెప్పి ఆ నివేదికను పట్టించుకోలేదు. కానీ, ఐ ప్యాక్ టీమ్ చెప్పినట్టుగానే రాష్ట్రంలో వైసిపి ఓటమిపాలైంది. ఇది కూడా జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఐప్యాక్ ను రంగంలోకి దించడానికి కారణంగా తెలుస్తోంది.
ఈ టీమ్ ఇచ్చిన నివేదికను పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బంది అయినట్లు గుర్తించిన జగన్మోహన్ రెడ్డి.. మరోసారి వారికే అవకాశాన్ని ఇవ్వడం ద్వారా 2029లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం పగడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్న జగన్.. ఈ బృందం ఇచ్చే నివేదికలు ఆధారంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐ ప్యాక్ ప్రతినిధులతో వైసిపి కి చెందిన ముఖ్య నాయకులు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల వరకు పనిచేసేందుకు అవసరమయ్యే మొత్తాన్ని అందించేందుకు వైసిపి సిద్ధపడింది. చర్చలు పూర్తయిన తర్వాత అంటే కొత్త ఏడాది సంక్రాంతి నాటికి ఐప్యాక్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఐ ప్యాక్ బృందాన్ని మరోసారి రంగంలోకి దించుతుండడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. గతంలో ఈ ఐ ప్యాక్ బృందాలు చేసిన సర్వే వల్ల పెద్దగా ప్రయోజనం దక్కలేదని, పై పెచ్చు నియోజకవర్గాల ఇన్చార్జిలు, నాయకులను కంట్రోల్ లో పెట్టే ప్రయత్నాన్ని వీరు చేశారంటూ పలువురు పేర్కొంటున్నారు. కొందరు ఐప్యాక్ ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల దగ్గర భారీగా డబ్బులు తీసుకొని వారికి అనుకూలంగా నివేదికలు సమర్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వారిని మరొకసారి తీసుకురావడం వల్ల ప్రయోజనం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. సదరు సంస్థలకు ఇచ్చే డబ్బులను పార్టీకి బలంగా పనిచేసే కార్యకర్తలకు ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని పలువురు సూచిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం, సర్వేల నిర్వహించడంలో అపార అనుభవం కలిగిన ఈ సంస్థతోనే మంచి ఫలితాలను రాబట్టేందుకు అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఐ ప్యాక్ టీమ్ ఏపీలో అడుగుపెట్టనుంది.