హైదరాబాదులో అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతున్న హైడ్రా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ స్టార్ట్ చేసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైంది. తాజాగా హైడ్రా కూకట్పల్లి పరిధిలోని అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కూకట్పల్లిలో చెరువులను ఆక్రమించి సాగించిన నిర్మాణాలను, కట్టడాలను కూల్చి వేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూల్చివేత పనులను అధికారులు చేపట్టారు.
కూకట్పల్లిలో సాగుతున్న కూల్చివేతలు
హైదరాబాదులో అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతున్న హైడ్రా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ స్టార్ట్ చేసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైంది. తాజాగా హైడ్రా కూకట్పల్లి పరిధిలోని అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కూకట్పల్లిలో చెరువులను ఆక్రమించి సాగించిన నిర్మాణాలను, కట్టడాలను కూల్చి వేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూల్చివేత పనులను అధికారులు చేపట్టారు. కూకట్పల్లిలో నల్లచెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. నల్ల చెరువు సర్వే చేశారు. ఇందులో బఫర్ జోన్లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. బఫర్ జోన్ లోని నాలుగు ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించినట్లు గుర్తించారు. ఎఫ్డిఎల్ లోని మూడు ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్ల యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆదివారం తెల్లవారుజామునే హైడ్రా అధికారులు పోలీసులు కూకట్పల్లి చేరుకున్నారు. చెరువు పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు.
కూల్చివేతల సమయంలో స్థానికుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చినేత ప్రక్రియను అధికారులు నిర్వహించారు. అదేవిధంగా అమీన్పూర్ పరిధిలోను హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. కూల్చివేత ప్రక్రియకు ముందు హైడ్రా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులను ఇస్తోంది. దీనిపై అటు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. పక్కా కట్టడాలు ఉన్నవాటికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని దానిపై హైడ్రా అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం నల్ల చెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం ద్వారా చాలా వరకు చెరువు స్థలాన్ని మళ్లీ క్లియర్ చేయించినట్లు అయిందని అధికారులు చెబుతున్నారు. హైడ్రా అధికారులు ప్రస్తుతం కూకట్పల్లిపై దృష్టి సారించడంతో ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎంతోమంది వెన్నులో వణుకు పుడుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని ఆక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు నగరమంతట ఈ తరహా అక్రమ నిర్మాణాలు చెరువులు, ఆక్రమణలపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఆయా చెరువులకు సంబంధించిన వివరాలను హైడ్రా ఉన్నతాధికారులు సేకరించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.