||Pic Credit : Google Maps||
ఈవార్తలు, హైదరాబాద్ : 2023 కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజాము 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అటు.. డిసెంబర్ 31ని పురస్కరించుకొని రాత్రి పూట పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపడతారని వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాదీలు పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలివే..
- ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలను అనుమతించరు.
- ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్‌భవన్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.
- లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద దారి మళ్లిస్తారు.
- మింట్ కాంపౌండ్ రోడ్డును మూసివేస్తున్నారు.
- నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి మీదుగా సంజీవయ్య పార్క్ వైపు వెళ్లే వాహనాలను రాణిగంజ్ మీదుగా మళ్లిస్తారు.
- సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ కూడలి, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ ఆలయం మీదుగా మళ్లిస్తారు.
సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- ఓఆర్ఆర్ పై రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు తప్ప ఇతర వాహనాలకు అనుమతి ఉండదు.
- పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌పైనా ఆ నిబంధనలే అమల్లో ఉంటాయి.
- గచ్చిబౌలి శిల్పలేవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ పార్క్ ఫ్లైవర్ లెవెల్ 1, 2, షేక్ పేట ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు తీగల వంతెన సైబర్ టవర్ ఫ్లైవర్, ఫోరం మాల్ ఫ్లైవర్, జేఎన్‌టీయూ ఫ్లైవర్, కైతలాపూర్ పైవంతెన, బాలానగర్ బాబుజగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ పైకి ఆ సమయంలో వాహనాలను అనుమతించరు
అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సదుపాయం
న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో సేవలు కొనసాగనున్నాయి. ఒంటి గంటకు చివరి మెట్రో రైల్ ప్రారంభమై, రెండు గంటలకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుంది.