lost your phone | మీ స్మార్ట్ ఫోన్ పోయిందా.. తిరిగి తెచ్చుకోవచ్చిలా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||సీఈఐఆర్ వెబ్ పోర్టల్ స్క్రీన్ షాట్||

ఈవార్తలు, టెక్ న్యూస్: ఇష్టపడి కొనుక్కున్న ఫోన్‌ను ఎవరైనా దొంగిలించారా? లేదా ఎక్కడైనా పోయిందా? అయితే, ఫోన్ పోయిందన్న చింత అక్కర్లేదు. అవును.. మీరు పోగొట్టుకున్న, దొంగిలించబడిన ఫోన్‌ను వెతికి ప్రభుత్వమే మీ చేతికి అప్పగిస్తుంది. ఫోన్ పోయినవెంటనే బాధితులు దగ్గరలోని మీసేవ కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేయాలి. అందుకు మీ ఫోన్ ఐఎంఈఐ నంబరు కచ్చితంగా ఉండాలి. ఫిర్యాదు రిసిప్ట్‌తో దగ్గరలోని సిమ్ కంపెనీ స్టోర్‌కు వెళ్లి పాత నంబర్‌పై కొత్త సిమ్ తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా పాత సిమ్ బ్లాక్ అవుతుంది.

అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తీసుకొచ్చిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘బ్లాక్ స్టోలెన్, లాస్ట్ మొబైల్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో అడిగిన వివరాలను నమోదు చేయాలి. ఫిర్యాదు రిసిప్ట్, ఐడెంటిటీ కార్డు, ఐఎంఈఐ నంబర్ తదితర సమాచారాన్ని అందజేయాలి. అనంతరం మీ కొత్త సిమ్‌కు రిక్వెస్ట్ ఐడీ వస్తుంది. ఆ ఐడీతో కేస్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఫిర్యాదు అందిన 24 గంటల్లో సీఈఐఆర్ పోర్టల్ సిబ్బంది ఆ ఫోన్‌ను బ్లాక్ చేసి పనిచేయకుండా చేస్తారు.

ఫోన్‌లో కొత్త సిమ్‌ వేయడానికి ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు, బాధితుడి కొత్త సిమ్‌కు మెసేజ్ వస్తుంది. ఆ ఫోన్‌లో వేసిన నంబర్ డిస్‌ప్లే అవుతుంది. వెంటనే పోలీసులు సదరు వ్యక్తికి ఫోన్ చేసి, తెచ్చి పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని, లేకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తారు. ఫోన్ రికవరీ అయ్యాక, బాధితుడు మళ్లీ పోర్టల్‌లోకి వెళ్లి అన్ బ్లాక్ ఫౌండ్ మొబైల్ ఆప్షన్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేయాలి. రిక్వెస్ట్ ఐడీ, ఫోన్ నంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. అనంతరం ఫోన్ అన్ బ్లాక్ అయ్యి, వినియోగించుకునేందుకు వీలు కలుగుతుంది.

వెబ్ స్టోరీస్