ఏపీలో కొత్త పింఛన్ల మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే సమయంలో అనర్హులైన వారికి అందిస్తున్న పెన్షన్లను తొలగించేందుకు కూడా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు, చేనేతలు, ఒంటరి మహిళలు ఇలా అన్ని విభాగాల్లోనూ వైకాపా అనుకూల నేతల సిఫార్సులు చేస్తే అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేశారు. మరోవైపు వేల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు అర్హత ఉన్న వివిధ సాకులతో పక్కన పెట్టారు.
పెన్షన్ తో వృద్ధురాలు
ఏపీలో కొత్త పింఛన్ల మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే సమయంలో అనర్హులైన వారికి అందిస్తున్న పెన్షన్లను తొలగించేందుకు కూడా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు, చేనేతలు, ఒంటరి మహిళలు ఇలా అన్ని విభాగాల్లోనూ వైకాపా అనుకూల నేతల సిఫార్సులు చేస్తే అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేశారు. మరోవైపు వేల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు అర్హత ఉన్న వివిధ సాకులతో పక్కన పెట్టారు. గత ఐదేళ్లలో దాదాపు 8 లక్షల మంది పింఛన్లు తొలగించారు. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించే ఉద్దేశంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించనున్నారు. ఆదాయపన్ను, రవాణా శాఖ, కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచి అవసరమైన డేటా తెప్పించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని డేటా కూడా తీసుకుంటున్నారు. ఆరు అంచెల తనిఖీ నిబంధనల ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారుల్లో రాష్ట్రస్థాయిలోనే అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు.
వితంతువులు, ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపునుకు ప్రత్యేక విధానాన్ని అవలంబించనున్నారు. ఆ జాబితాను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలించనుంది. గత ప్రభుత్వం ఆరు అంచెల నిబంధనలు కారణంగా అర్హత ఉన్నా కొందరికి పింఛన్లు ఇవ్వలేదు. దీనిపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అర్హుల ఎంపికకు కొత్త విధానాల రూపొందిస్తారా..? లేదా.? అనేది స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అధికారులు గుర్తించిన అర్హుల, అనర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించునున్నారు. ఆ జాబితాలో తేడాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించనున్నారు. అనర్హులకు నోటీసులు పంపించి లిఖితపూర్వక సమాధానాన్ని తీసుకుంటారు. తర్వాత గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అర్హులు ఎవరు పింఛన్ కు దూరం కాకూడదన్న ఉద్దేశంతో రెండు మూడు రకాలుగా అభ్యంతరాలను స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్నిటిని మళ్లీ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో తనిఖీ చేయించనున్నారు. కొత్త పెన్షన్ల మంజూరుకు అక్టోబర్ లో దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత వాటిని ధృవీకరించేలా దరఖాస్తుదారుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారు. అర్హులు దరఖాస్తులను అధికారులు ఆమోదించకపోయినా గ్రామ సభల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తాజా ప్రభుత్వం నిర్ణయంతో అర్హులకు మేలు జరగనుంది. కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాదిమందికి అక్టోబర్లో మోక్షం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా జోరుగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.