ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొద్ది రోజుల్లోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ప్రారంభం కానుంది.
శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొద్ది రోజుల్లోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ప్రారంభం కానుంది. కొద్దిరోజుల్లోనే ఉచిత శిక్షణను ప్రారంభిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకాన్ని చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆయన స్ఫూర్తితోనే డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ శిక్షణ ప్రారంభం కానుంది. ఒక్కో కోచింగ్ సెంటర్లో 200 మంది అభ్యర్థులకు ఉచితంగా ఈ శిక్షణను ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శిక్షణతోపాటు సుమారు మూడు వేల రూపాయల విలువ చేసే స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా అభ్యర్థులకు అందించమన్నారు. బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున బీసీ స్టడీ సర్కిల్స్ లో శిక్షణకు సీట్లు కేటాయించనున్నారు. వీరితోపాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించారు. రెండు నెలలపాటు ఇచ్చే ఈ శిక్షణ సమయంలో నెలకు రూ.1500 చొప్పున స్టైఫండ్, మెటీరియల్ కోసం అదనంగా మరో రూ.1000 ఇవ్వనున్నారు. ఆఫ్ లైన్ తోపాటు ఆన్ లైన్ లోనూ కోచింగ్ ఇవ్వనున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ ను రూపొందించనున్నారు. బీఈడి అర్హతతోపాటు టెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే ఈ కోచింగ్ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత శిక్షణ కోసం ఇప్పటికే అభ్యర్థుల నుంచి బీసీ స్టడీ సర్కిల్స్ అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుదారుల్లో మెరిట్ ప్రాతిపదికన శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ శిక్షణలో అభ్యర్థులకు బోధించేందుకు అనుగుణంగా ఫ్యాకల్టీని సిద్ధం చేసింది.