తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి మహిళకు ఉచితంగా రెండు చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చర్యలు చేపడుతోంది. గతంలో కెసిఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ఒక్కో మహిళకు ఒక చీర చొప్పున అందించారు. ఈ పథకాన్ని రద్దు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని స్థానంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఏటా రెండేసి చొప్పున చీరలు అందించాలని నిర్ణయించింది.
చీరలు
తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి మహిళకు ఉచితంగా రెండు చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చర్యలు చేపడుతోంది. గతంలో కెసిఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ఒక్కో మహిళకు ఒక చీర చొప్పున అందించారు. ఈ పథకాన్ని రద్దు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని స్థానంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఏటా రెండేసి చొప్పున చీరలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల తొమ్మిదో తేదీన హైదరాబాదులో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఐఐహెచ్టి) ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు అనుగుణంగా చేనేత, జౌళి శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత అంచనాల ప్రకారం 63.86 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి రెండు చొప్పున చీరలు అంటే 1,27,72,000 చీరలు పంపిణీ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరాల పంపిణీ కింద రూ.335 కోట్లు ఖర్చు చేసి కోటి మందికి ఒక్కో చీర చొప్పున పంపిణీ చేసింది.
అయితే, వీటి నాణ్యత సరిగా లేకపోవడంతో అప్పట్లో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాణ్యమైన చీరలను రెండు చొప్పున అందించేందుకు సిద్ధపడుతోంది. ఒక్కో చీరకు 6 మీటర్లు చొప్పున 7.66 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేనేత వస్త్రాలు సామర్థ్యం 7 లక్షల మీటర్ల వరకే ఉంది. ఈ క్రమంలో మరమగ్గాల చీరలనే అందించాలని ప్రాథమికంగా అధికారులు నిర్ణయించారు. ఈ పథకంలో భాగంగా చేనేతకు భాగస్వామ్యం కల్పిస్తూ కొంతమేరకు ఆర్డర్లు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ పథకం విధివిధానాలు ఖరారై ఆర్డర్ ఇస్తే 1.27 కోట్ల చీరలు తయారీకి ఆరు నెలల వరకు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాది ఉగాది నాటికి ఆయా చీరలను లబ్ధిదారులకు అందించే అవకాశం ఉంది. కొద్దిరోజుల్లోనే ఈ చీరల పంపిణీ పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆదేశాలు రావడానికి ముందే క్షేత్రస్థాయిలో అధికారులు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని అధికారులు తెప్పించుకుంటున్నారు. గతంలో కెసిఆర్ ప్రభుత్వం ఈ చీరల పంపిణీకి చేనేత, జౌళి శాఖ నిధులను వెచ్చించింది. అయితే, ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో నిధులను కూడా వినియోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.