బంగారం ధర రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత దేశీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లో మూడు వేల వరకు ధర తగ్గుముఖం పట్టగా, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. గడిచిన నెలలో రేసుగుర్రంలా పరిగెత్తిన పసిడి ధర.. ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో గత నెల 30న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రికార్డు స్థాయిలో రూ.81,800 పలికింది.
బంగారం
బంగారం ధర రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత దేశీయంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లో మూడు వేల వరకు ధర తగ్గుముఖం పట్టగా, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. గడిచిన నెలలో రేసుగుర్రంలా పరిగెత్తిన పసిడి ధర.. ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో గత నెల 30న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రికార్డు స్థాయిలో రూ.81,800 పలికింది. దీంతో డిసెంబర్ నాటికి 10 గ్రాముల పుత్తడి ధర లక్షకు చేరుతుందని అంచనాలు వినిపించాయి. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.75,650 కు చేరింది. కేవలం 17 రోజుల్లోనే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.6,150 తగ్గింది. అక్టోబర్ లో జీవితకాల గరిష్ట స్థాయికి చేరిన పసిడి ధర చూసి చాలామంది ఆందోళన చెందారు. దీంతో ఈ ఏడాది త్రయోదశి కూడా బులియన్ మార్కెట్ కు పెద్దగా కలిసి రాలేదు.
పెళ్లిళ్ల సీజన్లో పసిడి ధర తగ్గుముఖం పట్టడంతో కొనుగోలు మళ్ళీ ఊపొందుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధర తగ్గడంతో మెట్రో నగరాలతో పాటు చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లోని నగల దుకాణాలకు ప్రస్తుతం రద్దీ పెరుగుతోంది. మరోవైపు పసిడి ధర తగ్గడంతో పెళ్లిళ్ల కోసం చేసే నగల బడ్జెట్ తగ్గిందని వధూవరుల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో బులియన్ మార్కెట్ పోయింది. అక్టోబర్లో ఔన్స్ బంగారం ధర రికార్డు స్థాయిలో 2,790 డాలర్లు పలికింది. ప్రస్తుతం 2,570 డాలర్లకు దిగి వచ్చింది. గడిచిన 15 రోజుల్లోనే ఔన్స్ పసిడి ధర రూ.240 డాలర్లు పడిపోయింది. డిసెంబర్ నాటికి ఔన్స్ పసిడి ధర మరో 60 డాలర్ల మేరకు దిగి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పెళ్లిళ్ల కోసం పసిడి కొనాలనుకునేవారు మరికొద్ది రోజులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
ఆదివారం దేశంలోనే అనేక ప్రాంతాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,800 గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,350 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,650 గా ఉంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, ముంబై, పూణేలో రూ.89,500 గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నైలో కేజీ వెండి రూ.99,000 వద్ద కొనసాగుతోంది.