కేసుల భయంతో వైసిపికి దూరం.. రాష్ట్రంలో కూటమి వ్యూహాత్మక ఎత్తుగడ

సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది. ఈ చర్యల ద్వారా ఇటు అధికార వర్గాలతో పాటు అటు వైసీపీకి చెందిన కేడర్ ను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే మరో వ్యూహాత్మక ఎత్తుగడతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Posani Krishna Murali, Sri Reddy
పోసాని కృష్ణమురళీ, శ్రీరెడ్డి

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షంగా నిలిచిన వైసీపీని కోలుకోకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు గడచిన ఐదేళ్లు వైసీపీకి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది. ఈ చర్యల ద్వారా ఇటు అధికార వర్గాలతో పాటు అటు వైసీపీకి చెందిన కేడర్ ను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే మరో వ్యూహాత్మక ఎత్తుగడతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే వైసీపీకి దగ్గరగా ఉన్న కీలకమైన వ్యక్తులను దూరం చేసే ప్రయత్నం. ఇందుకోసం కూటమిలోని ముఖ్య నాయకులు ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది ఆయనకు అండగా నిలిచారు. సినీ రంగం నుంచి పెద్దలు ఎవరు వైసీపీకి అండగా ఉండేందుకు ముందుకు రాకపోయినప్పటికీ పోసాని కృష్ణమురళీ వంటి వారు ముందుకు వచ్చి జగన్ పక్షాన నిలిచారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేవారు. అటువంటి పోసాని కృష్ణ మురళి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిరోజులపాటు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. సాక్షి ఛానల్ లో ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం రన్ చేస్తూ మరోసారి జగన్ కు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయన కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటించారు.

ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీనికి కారణం కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిడిగా చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కేసులను ఎదుర్కోవడం ఇబ్బందిగా మారుతుంది అన్న ఉద్దేశంతోనే కుటుంబ సభ్యుల సలహా మేరకు ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. అయితే పోసాని కృష్ణ మురళి ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కూటమి పెద్దల ఒత్తిడి, కేసులు వల్ల కలిగే ఇబ్బందులు వంటి అంశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కూటమి నాయకులు భయపెట్టి పోసాని కృష్ణమురళిని రాజకీయాలకు దూరంగా జరిగేలా చేసిందన్న విశ్లేషనలు వినిపిస్తున్నాయి. ఒక్క పోసాని కృష్ణ మురళి విషయంలోనే కాదు కొద్ది రోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే నటి శ్రీరెడ్డి కూడా ఇటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకొని ఆమె అనేక సందర్భాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమెపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కేసులు నమోదు అవుతుండడంతో కుటుంబ సభ్యుల సలహా మేరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.

అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులకు క్షమాపణలను కోరింది. శ్రీ రెడ్డి కూడా రాజకీయంగా నమోదవుతున్న కేసులతో ఇబ్బందులు పడలేమన్న భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె రెండు లేఖలు కూడా రాశారు. తాజాగా పోసాని కృష్ణ మురళి కూడా అటువంటి నిర్ణయాన్ని తీసుకోవడంతో రాజకీయంగా ప్రస్తుతం ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన గట్టిగానే సాగుతుందన్న చర్చ నడుస్తోంది. మరోవైపు రాజకీయంగాను తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వారిపైన రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల కేసులను నమోదు అవుతున్నాయి. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారిపై అనేక చోట్ల కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సినీనటుడు వర్మ పైన కూడా పలువురు ఫిర్యాదులు చేశారు. ఆయనకు ఇప్పటికే పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నోటీసులు నేపథ్యంలో వర్మ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారు అన్న చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భయపెడుతోంది అన్న చర్చ అయితే గట్టిగానే సాగుతోంది. ఈ పరిస్థితులను వైసీపీ ఎలా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. గడచిన కొన్నాళ్లుగా వైసిపికి బలమైన సపోర్టర్స్ గా ఉంటూ వస్తున్న వారంతా అస్త్ర సన్యాసం చేస్తుండడంతో వైసీపీ శ్రేణులు కూడా డీలా పడుతున్నాయి. ఈ పరిస్థితులనుంచి వైసిపి ఎలా గట్టెక్కుతుందో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్