Kondagattu | కొండగట్టులో భక్తుల రద్దీ.. కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం||

ఈవార్తలు, జగిత్యాల జిల్లా : పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు భక్తులతో కిటకిటలాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చిన అంజన్న భక్తులతో కొండగట్టు గుట్ట జైశ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో హోరెత్తుతోంది. పెద్ద హనుమాన్ జన్మ దినోత్సవ ఉత్సవాల సందర్భంగా సమీప ప్రాంతం మొత్తం కాషాయమయమైంది. గుట్ట కింది నుంచి పై వరకు శ్రీరామ నామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. ముఖ్యంగా హనుమాన్ దీక్షాస్వాములు తమ మాల విరమణ కోసం కాలి నడకన గుట్టమీదికి వస్తున్నారు. అయితే, భక్తుల అవసరాల దృష్ట్యా అధికారులు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎండలో గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చున్నా, కనీసం నీళ్లు అందించిన దాఖలాలు లేవని భక్తులు మండిపడుతున్నారు. కొందరు భక్తులు నీళ్లు లేక దాహంతో సొమ్మసిల్లి పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు భక్తుల కోసం సౌకర్యాలు కల్పించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు వాళ్ల చుట్టూనే తిరుగుతూ ప్రదక్షిణలు చేసే అధికారులు, స్థానిక నాయకులు.. భక్తుల కోసం మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవటం విమర్శలకు దారితీస్తోంది. పోలీసులు బందోబస్తు చేపట్టి, భక్తులకు దిశానిర్దేశం చేస్తున్నా, పాలక వర్గాలు మాత్రం భక్తుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవటం పాలనా వైఫల్యమేనని ప్రతిపక్షాల మండిపడుతున్నాయి. దీనిపై ఆలయ ఈవోను వివరణ కోరగా, వాలంటీర్లను ఏర్పాటు చేశామని, షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. నీళ్ల సదుపాయం అసలే లేదని భక్తులు చెప్పడంపై అడగ్గా, ఆయన సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్