మహారాష్ట్ర సీఎం ఎవరు అన్నదానిపై కూటమి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమైంది. అయితే తాజాగా బిజెపి కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన తొలి రోజు నుంచి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కు అవకాశం కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే బిజెపి అగ్రనాయకత్వం మహారాష్ట్రలోని నేతలకు సమాచారాన్ని అందించినట్లు చెబుతున్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. ఎన్నికల్లో బిజెపి, షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవర్ నేతృత్వంలోని ఎన్సిపి కూటమిగా పోటీ చేసి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. కానీ సీఎం ఎవరు అన్నదానిపై కూటమి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమైంది. అయితే తాజాగా బిజెపి కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన తొలి రోజు నుంచి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కు అవకాశం కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే బిజెపి అగ్రనాయకత్వం మహారాష్ట్రలోని నేతలకు సమాచారాన్ని అందించినట్లు చెబుతున్నారు. అయితే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే ఇందుకు అంగీకరించకపోవడంతో ప్రకటన వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా ఏక్ నాథ్ షిండే తోపాటు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తో సమావేశమై ఈ మేరకు ఒప్పించినట్లు చెబుతున్నారు. దీంతో కాస్త మెత్తబడిన షిండే దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎంగా చేసేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎంగా నిర్ణయిస్తూ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సోమవారం మహాయుతి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీనికి సంబంధించిన స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
ఈ సమావేశానికి మూడు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ముఖ్య మంత్రి ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోవడంతోపాటు కీలక శాఖలకు సంబంధించిన కేటాయింపులు జరగనున్నట్లు తెలుస్తోంది. హోంశాఖ, పట్టణాభివృద్ధి, పిడబ్ల్యుడి, ఆర్థిక శాఖలతోపాటు అసెంబ్లీ స్పీకర్ పదవిపై మూడు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. దీంతో సోమవారం నిర్వహించనున్న సదస్సుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ మంత్రి పదవులకు సంబంధించిన స్పష్టత కొరవడం వల్లే సీఎం పేరు ప్రకటన వాయిదా పడుతున్నట్లు చెబుతున్నారు. డిసెంబర్ రెండో తేదీలోగా తేల్చుకోవాలని, లేదంటే తామే తేలుస్తామని అమిత్ షా ఈ ముగ్గురు నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం నిర్వహించనున్న సమావేశంలో వీటికి సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని ముగ్గురు నేతలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గడిచిన కొద్దిరోజులుగా ఏక్ నాథ్ షిండే మౌనం దాలుస్తూ వస్తున్నారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి విషయంలో ఆయన తాజాగా తన మౌనాన్ని వీడారు. మహాయుతి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇది ఎలా ఉంటే మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడే మహా యతి ప్రభుత్వంలో ఏక్ నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే డిప్యూటీ సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏక్ నాథ్ షిండే బిజెపి అగ్రనాయకత్వాన్ని కోరినట్లు చెబుతున్నారు. శ్రీకాంత్ షిండే ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నారు శ్రీకాంత్ షిండే డిప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తే ఏక్ నాథ్ షిండే కేంద్రంలోకి వెళ్లి కేంద్ర మంత్రి పదవిని స్వీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు.