తిరుపతి లడ్డు వ్యవహారంపై విచారణకు సిట్.. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్న సీఎం చంద్రబాబు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు జరిపించి భక్తుల మనోభావాలతో ఆటలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఐజి, అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయబోతోంది.

Tirumala Tirupati Devasthanam

తిరుమల తిరుపతి దేవస్థానం

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి వైసీపీ హయాంలో కల్తీ జరిగిందంటూ కొద్ది రోజులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ  ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా టీటీడీ లడ్డూ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు జరిపించి భక్తుల మనోభావాలతో ఆటలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఐజి, అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. సిట్ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని, ప్రతి దేవాలయంలో సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు 

లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి నాణ్యత దెబ్బతినడం వలన తిరుమల తిరుపతి దేవస్థానానికి అపచారం జరిగిందంటూ భక్తులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రక్షాళనకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వేద పండితులు, అర్చకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని సంప్రోక్షణకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్దనున్న యాగశాలలో సోమవారం ఉదయం శాంతి హోమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో దోషాలు జరిగితే వాటి పరిహారానికి ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఈవో తిరుమల రావు వెల్లడించారు. లడ్డు పోట్లలో సంప్రోక్షణ చేశామని పేర్కొన్నారు. ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని, కల్తీ నెయ్యి వాడకం వల్ల వచ్చిన దోషం తొలగిపోయినట్లేనని, భక్తుల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఆగమ శాస్త్ర సలహాదారులు పెద్దజీయంగార్లను సంప్రదించి శాంతి హోమం నిర్వహిస్తున్నామని ఈవో వెల్లడించారు. 

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. నెయ్యి కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అబద్ధాలు ఆడుతూ కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు పటిష్టమైన తనిఖీ వ్యవస్థలు ఉన్నాయని, నాణ్యత లేదని తెలిస్తే ట్యాంకర్లను తిరస్కరిస్తారని జగన్ పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం హయంలో 18 ట్యాంకర్లను తిప్పి పంపినట్టుగా పేర్కొన్నారు. నెయ్యి కొనుగోలుకు ఆరు నెలలకు ఒకసారి టెండరింగ్ ప్రక్రియ జరుగుతుందని, తక్కువ ధరకు కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ అప్పగిస్తారన్నారు. ఎన్ఎబిఎల్ ధ్రువీకరణ ఉన్న ల్యాబ్ లో పరీక్షించిన సర్టిఫికెట్ తో నెయ్యి ట్యాంకర్ ను పంపించాల్సి ఉంటుందని, తిరుపతికి వచ్చిన తర్వాత మళ్లీ మూడు నమూనాలు తీసుకొని పరీక్షిస్తారన్నారు. ఒక్క నమోనా నాసిరకమని తేలినా తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తిరుపతిలో లడ్డు ప్రసాదం కల్తీ జరగడం దారుణం అన్నారు. దీనిని హిందూ ధర్మంపై దాడి చేసే కుట్రలో భాగంగా పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కోరుకుంటే దీనిపై సిబిఐ విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్