రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. దీనిపై రెండో రోజు కలెక్టర్ల సదస్సులో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. రానున్న మూడు నెలల్లో ప్రతి పెన్షన్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనార్హులకు పెన్షన్ అందకూడదని, అర్హులైన వారు పెన్షన్ కు దూరంగా ఉండకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనిని స్పష్టం చేశారు.
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. దీనిపై రెండో రోజు కలెక్టర్ల సదస్సులో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. రానున్న మూడు నెలల్లో ప్రతి పెన్షన్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనార్హులకు పెన్షన్ అందకూడదని, అర్హులైన వారు పెన్షన్ కు దూరంగా ఉండకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనిని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో సమాచారాన్ని తెప్పించుకొని చూడాలని, ప్రతి పెన్షన్ పరిశీలించి అర్హులో, కాదో నిర్ధారించుకుని వారిని కొనసాగించాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్ కు అనుగుణంగా నిర్వహించాలని 100 రోజుల పని దినాలు సరిగా నిర్వహిస్తేనే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని స్పష్టం చేశారు. పని దినాలు, మెటీరియల్ కాంపోనెంటును పూర్తి చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. పల్లె పండగలో 14.8 శాతం పనులు చేశారని, ఇంకా నెలన్నర సమయమే ఉందన్నారు. అల్లూరి జిల్లాలో 54 శాతం అయితే, మరో జిల్లాలో 1.6 శాతం పనులు కావడంపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించలేదని, కలెక్టర్లు నిర్లిప్తంగా ఎందుకు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ డబ్బులు ఉన్నా ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషను దెబ్బతీసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించామని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులు ఉంటే వారికి పెన్షన్ అందించాలని సూచించారు. సదరం ధ్రువీకరణ పత్రాలు అర్హులకే దక్కేలా చూడాలన్నారు. రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం కావాలన్నారు. విజయవాడ, గుంటూరు నగరాలు అమరావతిలో కలిసిపోతాయని, పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో నిరంతరాయంగా ప్రణాళికలు ఉండాలన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, స్వచ్ఛంధ్రలో భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలని ఆదేశించారు. స్వచ్ఛత, శుభ్రత అనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం 82 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలి వెళ్లిందని, చెత్త తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
'రాష్ట్రం ఫస్ట్ - ప్రజలే ఫైనల్' అనే నినాదంతో ముందుకు వెళుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రభుత్వ పాలన ఆరు నెలలు గడిచిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. నిర్బంధం, సంక్షోభం అభద్రతతో గడిచిన ఐదేళ్ల కాలాన్ని ప్రజలు ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని వెల్లడించారు. ఆ ఆశలను నెరవేర్చే బాధ్యత తమపై ఉందన్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలు ఆకాంక్షలు తీర్చేందుకు తనతోపాటు మంత్రివర్గ సహచరులంతా కృషి చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దామని, వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లు పేర్కొన్నారు. మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ తో ఏపీని నెంబర్ వన్ గా నిలబెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని, నిర్లిప్తత విడనాడాలని సూచించారు. పనులు కోసం వచ్చే ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని సూచించారు. అదే సమయంలో రోజులు తరబడి ఏ ఫైలు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు.