ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే వెంకటేశ్వర స్వామి ఆలయంలో అందించే ఈ స్వామివారి లడ్డూకు ఎంతో ప్రత్యేకత ఉంది. తిరుమలలో అందించే లడ్డు ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించి భక్తులు స్వీకరిస్తుంటారు. అటువంటి ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ తయారీలో ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును కలిపారంటూ వ్యాఖ్యానించారు.
తిరుమల లడ్డూ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే వెంకటేశ్వర స్వామి ఆలయంలో అందించే ఈ స్వామివారి లడ్డూకు ఎంతో ప్రత్యేకత ఉంది. తిరుమలలో అందించే లడ్డు ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించి భక్తులు స్వీకరిస్తుంటారు. అటువంటి ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ తయారీలో ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును కలిపారంటూ వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు ప్రసాదాన్ని నాసిరకంగా మార్చేశారని, ఎన్ని ఫిర్యాదులు చేసిన శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నోసార్లు తాము చెప్పామని, అయినా తిరుమలలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చివరకు అన్న ప్రసాదంలోనూ నాణ్యత లేకుండా చేశారని, సాక్షాత్తు స్వామి దగ్గర పెట్టే ప్రసాదం కూడా అపవిత్రం చేశారని ఆరోపించారు. నాసిరకం సరుకులే కాకుండా లడ్డు ప్రసాదం తయారీకి నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యి అందిస్తున్నామని, ఈ నెయ్యితోనే ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు హిందూ భక్తుల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. పరమ పవిత్రంగా భావించే స్వామివారి ప్రసాదంలో జంతువుల కొవ్వును కలపడం అంటే సాధారణ విషయం కాదని పలువురు పేర్కొంటున్నారు. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈ తరహా విమర్శలు చేయడం వెనుక బలమైన ఆధారాలు ఉండి ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తిరుమలలో ఏ కార్యక్రమం జరగాలన్న దాని వెనుక పెద్ద యంత్రాంగమే ఉంటుందని, అటువంటిది వేలాది మంది భక్తులకు అందించే ప్రసాదంలో కొవ్వు కలపడం అంటే సాధారణ విషయం కాదని పలువురు పేర్కొంటున్నారు. రాజకీయపరమైన లబ్ధి కోసమే ఈ తరహా విమర్శలు చేస్తున్నారే తప్ప.. వాస్తవం లేదని చెబుతున్నారు. ఒకవేల జంతువుల కొవ్వు కలిపి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తే అదే చోట పని చేసే హిందువులు దానిని ఉపేక్షించే అవకాశం లేదని, ఇప్పటికే వాటికి సంబంధించిన వీడియోలు, సమాచారం బయటకు వచ్చి ఉండేదని పలువురు చెబుతున్నారు. గతంలో కూడా టిడిపి నేతలు ఎప్పుడూ ఇటువంటి విమర్శలు చేయలేదని, మరి అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడు స్వామి వారి లడ్డూ ప్రసాదంపై ఈ తరహా విమర్శలు చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలియడం లేదని పలువురు పేర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన విమర్శల్లో వాస్తవం ఉంటే మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, దీనికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన విచారణకు ఆదేశించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. మరి సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలకు పరిమితమవుతారా..? లేదా విచారణకు ఆదేశించి వాస్తవాలను బహిర్గతం చేస్తారా.? అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సీఎం చంద్రబాబునాయుడు చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఎందుకంటే స్వామివారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే దేవాలయాల్లో తిరుమల ముందు వరుసలో ఉంటుంది. అటువంటి ఆలయంలోనే ఇటువంటి అపవిత్ర కార్యక్రమం చోటు చేసుకుంటే.. మిగిలిన చిన్న చిన్న ఆలయాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన భక్తుల్లో వ్యక్తం అవుతోంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ధార్మిక సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.