ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన కొన్నాళ్లుగా దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2024 ఎన్నికలను జమిలిలో నిర్వహించాలని భావించినప్పటికీ సాధ్యపడలేదు. అయితే, మూడోసారి కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను జోరుగా ముందుకు తీసుకు వెళుతోంది.
మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన కొన్నాళ్లుగా దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2024 ఎన్నికలను జమిలిలో నిర్వహించాలని భావించినప్పటికీ సాధ్యపడలేదు. అయితే, మూడోసారి కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను జోరుగా ముందుకు తీసుకు వెళుతోంది. ఈ క్రమంలోనే దేశంలో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు దశల వారీగా జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు, అవసరమైన సూచనలు ఇచ్చేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వం గతంలో నియమించింది. ఈ కమిటీ సుదీర్ఘంగా మేధోమధనం చేసి రాష్ట్రపతికి కొద్ది రోజుల కిందట నివేదికను సమర్పించింది. ఈ నివేదికలోని సిఫార్సులను ఆమోదిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఏకాభిప్రాయాన్ని సాధించి దీనిని అమలు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలతోపాటు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను జమిలి ఎన్నికలకు ఒప్పించే ప్రయత్నాన్ని చేయనుంది. అయితే, జమిలి ఎన్నికలు నిర్వహణ అంత సాధారణ విషయం ఏమీ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారంగా చెబుతున్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది జమిలి కోసం రాజ్యాంగానికి 18 సవరణలు చేయాలని కోవింద్ కమిటీ తన నివేదికలో సూచించింది.
ఎన్డీఏకు లోక్ సభలో 293 మంది ఎంపీలు, రాజ్యసభలో 113 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యాంగ సవరణ ప్రతిపాదన బిల్లు ఆమోదానికి లోక్ సభ, రాజ్యసభలో ఆయా సభలు మొత్తం సంఖ్యా బలంలో సాధారణ మెజారిటీ అవసరం. సభకు హాజరై ఓటింగ్ లో పాల్గొనే సభ్యుల్లో 2/3 వ వంతు మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. లోక్ సభలో ఆమోదం పొందాలంటే మొత్తం సంఖ్యాబలం 543లో కనీసం 272 మంది మద్దతు అవసరం. దీనితోపాటు సభకు హాజరయ్యే ఎంపీల్లో 2/3 వంతు మంది ఓటేయాలి. లోక్ సభలో ఎన్డీఏ బలం 293 మాత్రమే. ఇక రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కనీసం 123 మంది మద్దతు అవసరం. ఎన్డీఏ బలం 113 మాత్రమే. అంతేకాకుండా కొన్ని రాజ్యాంగ సవరణలకు సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం అవసరం అవుతుంది. కాంగ్రెస్, ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలు అంగీకరిస్తాయా.? అన్నది అనుమానంగా ఉంది. జమిలి వల్ల చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నిర్దిష్ట కాల పరిమితి కంటే ముందే రద్దు కావాల్సి ఉంటుంది. దీనికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడతాయా.? అనేది మరో సవాల్. ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు భారీ సంఖ్యలో కావాలి. వీటిని సమకూర్చుకోవడం కూడా కొంత ఇబ్బందిగానే భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో దేశంలోని 47 పార్టీలు తమ జమిలి ఎన్నికలకు సంబంధించి అభిప్రాయాన్ని కోవింద్ కమిటీకి తెలియజేశాయి. వీటిలో 32 పార్టీలు సమర్ధించాయి. ఆయా సభల్లో వీటి సంఖ్యాబలం 271. వ్యతిరేకించిన 15 పార్టీల సంఖ్య బలం 205. కోవింద్ కమిటీకి అభిప్రాయాలు తెలపని పార్టీల్లో టిడిపి కూడా ఉంది. ఇదిలా ఉంటే, అన్ని అవాంతరాలను దాటుకొని జమిలి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి వస్తే 2029లో ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికలు రెండు దశలుగా జరగనున్నాయి. మొదటి దశలో లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. రెండో దశలో అంటే సార్వత్రిక ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా ఉంటుంది.