బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మౌనం దేనికి సంకేతం.. వ్యూహాత్మకమేనా..?

కేసీఆర్‌ మౌనంగా ఉండడం వెనుక కారణమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ, కేసీఆర్‌ మాత్రం ఎక్కడా బయటకు వచ్చి మాట్లాడడం లేదు. దీనికి బలమైన కారణాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి పార్టీ బాధ్యతలను కేటీఆర్‌, హరీష్‌రావుకు ఆయన అప్పగించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే అవుతోంది.

kcr

 కేసీఆర్‌

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. తెలంగాణ ఏర్పాటు అనే కలను సాకారం చేసిన నేతగానే కాకుండా కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అరుదైన ఘనతను ఆయన దక్కించుకున్నారు. మూడోసారి జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటానని కేసీఆర్‌ ప్రగాఢంగా విశ్వసించారు. కానీ, అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్‌ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఎంతో మంది చెబుతుంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయడంతోపాటు పదేళ్లపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన తనకు ఓటమిని ప్రజలు ఇస్తారని ఆయన ఎప్పుడూ భావించలేదు. కలలో కూడా ఊహించలేదు. అటువంటి తనకు తెలంగాణ ప్రజలు ఓటమిని ఇవ్వడంతోపాటు పార్లమెంట్‌ ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని కట్టబెట్టారు. ఈ రెండు ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోవడంతోపాటు రాజకీయాల పట్ల కూడా ఒక రకమైన భావనకు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ కారణాలతోనే ఆయన ప్రజల్లోకి వచ్చేందుకు, నేతలతో కలిసి మెలిగేందుకు ఇష్టపడడం లేదని చెబుతుంటారు.

అయితే, ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. ఆయన గత కొన్నాళ్లుగా బయటకు మాత్రం రావడం లేదు. ఒకప్పుడు కేసీఆర్‌ అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రజా క్షేత్రంలోనూ ఉంటూ తన పోరును కొనసాగించారు. నిత్యం ప్రజలతో మమేకమై తన బలాన్ని మరింతగా పెంచుకుంటూ ముందుకు పోయారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఆయన ఫాంహౌస్‌కు మాత్రమే పరిమితమవుతున్నారు. అతికొద్ది మంది ముఖ్య నేతలను మాత్రమే కలుస్తున్నారు. సమావేశాలను కూడా అప్పుడప్పుడు ముఖ్య నేతలను పిలిపించుకుని అక్కడే పెట్టుకుంటున్నారు. ఆ మధ్య అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సందర్భంగా మాత్రమే ఒక రోజు సభకు వచ్చిన ఆయన ఆ తరువాత ఎక్కడా కనిపించడమే లేదు. ఒకవైపు హైడ్రా వ్యవహారంలోనూ, మూసీ అభివృద్ధికి సంబంధించిన విషయంలోనూ, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇష్యూలోనూ, రుణ మాఫీ అంశంలోనూ కేసీఆర్‌ ఎక్కడా స్పందించలేదు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావు మాత్రమే ఆయా అంశాలపై స్పందిస్తూ ప్రభుత్వంపై దాడికి దిగుతున్నారు. కానీ, కేసీఆర్‌ ఎక్కడా బయటకు వచ్చి వీటిపై మాట్లాడడం లేదు. అలాగని పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి దిశా, నిర్ధేశం కూడా చేయడం లేదు. ఇవన్నీ చూస్తున్న కేడర్‌కు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్‌ మౌనంగా ఉండడం వెనుక కారణమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ, కేసీఆర్‌ మాత్రం ఎక్కడా బయటకు వచ్చి మాట్లాడడం లేదు. దీనికి బలమైన కారణాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి పార్టీ బాధ్యతలను కేటీఆర్‌, హరీష్‌రావుకు ఆయన అప్పగించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే అవుతోంది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకుందని, మరో నాలుగేళ్లపాటు సమయం ఉన్నందున ఇప్పటికిప్పుడు బయటకు వచ్చి చేసే పోరాటాలు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న భావనను కేసీఆర్‌ వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. అలాగని, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లకపోయినా ఇబ్బందులు తప్పవు. కాబట్టి, ఆ బాధ్యతను పార్టీలో అగ్ర నాయకులుగా ఉన్న కేటీఆర్‌, హరీష్‌రావుకు అప్పగించారు. తాను మాత్రం తెలంగాణలోని కాంగ్రెస్‌ పార్టీ సాగిస్తున్న పాలనను, నిర్ణయాలను క్షుణ్ణంగా ఆయన పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. సరైన సమయంలో ఆయన బరిలోకి దిగుతారని, అంత వరకు ఆయన దాల్చిన మౌనం వ్యూహాత్మకమేనని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ మౌనం వెనుక మరో బలమైనకారణం ఉన్నట్టు పేర్కొంటున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి తనకు సమవుజ్జీగా చూసేందుకు కూడా కేసీఆర్‌ ఇష్టపడరని, ఆ కారణంతో కూడా ఆయన బయటకు రాకపోయి ఉండవచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా కేసీఆర్‌ దాల్చిన మౌనం ఆ పార్టీ కేడర్‌లో అనేక అనుమానాలకు కారణం అవుతుండగా, ప్రతిపక్ష పార్టీలకు మాత్రం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. ఆయన ప్రజాక్షేత్రంలోని మునుపటి స్పీడుతో ఎప్పుడు వస్తారో అని ఎదురుచూస్తున్న వాళ్లు కూడా తెలంగాణలో ఉన్నట్టు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్