||రేవంత్ రెడ్డి, రాజాసింగ్||
కొత్త తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మంత్రి వర్గ సమావేశం కూడా పూర్తయ్యింది. ఇగ మిగిలింది.. స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణం చేయటం. ఇందులో భాగంగానే శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయంపై గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ ఎన్నిక తనకు ఇష్టం లేదని, ఆయన ముందు తాను ప్రమాణం చేయబోనని స్పష్టం చేశారు.
తానే కాదు.. బీజేపీకి చెందిన మిగతా ఏడుగురు సభ్యులు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయబోరని తేల్చి చెప్పారు. అయితే, రేపు ఉదయం 9 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. దీని తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై పూర్తి క్లారిటీ రానుంది.