||భారతీయ కిసాన్ సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి యర్రం వెంకటరెడ్డి||
(రంగారెడ్డి, ఈవార్తలు, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
ఈ నేల మీద పేదరికాన్ని మించిన శాపం ఇంకొకటి లేదు అని, తరతరాలుగా మానవ జాతిని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య ఇది అని భారతీయ కిసాన్ సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి యర్రం వెంకటరెడ్డి అన్నారు. పేదరికం లేని ప్రపంచం కోసం కలలు కందామని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదరికం అనే శాపాన్ని రూపుమాపడం అంత సులభం కాదని, పేదరికం నుండి బయటపడడానికి ఒక రోజు చాలదేమో, కానీ పేదరికంలోనికి కూరుకు పోవడానికి ఒక సెకండ్ చాలు అని అన్నారు. అవి ప్రకృతి ప్రక్రోపాలు కావచ్చు మానవ నిర్మిత చర్యలైన కావచ్చు అని అన్నారు. మొన్నటికి మొన్న లిబియాలో వరదలు, ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం ఎంతోమందిని పేదలుగా మార్చి వేశాయని వీటిని ఆపడం మన చేతిలో లేదు కానీ, పాశవిక నాయకుల మానవ దాస్టికానికి బలి అయిన సామాన్యులు ఒక్క రోజులోనే ఈ పేదరికంలోనికి కూరుకొని పోతున్నారని తెలిపారు. ఇప్పుడు మనం చూస్తున్న ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధంలో గాజా ట్రిప్ ప్రాంతాన్ని ఉన్నఫళంగా ఖాళీ చేసి వెళుతున్న వారిలో చాలామంది నిన్నటి వరకు బాగా బతికిన వారే అని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం అనేదాన్ని కొలవటానికి ఒక ప్రమాణం అంటూ ఉండదని పేర్కొన్నారు.