అరవింద్ కేజ్రీవాల్ బయటకు రావడంతో హర్యానా ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంటుంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండడంతో ఇక్కడ ఆప్ పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి ఉండదని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ బయటకు రావడంతో ఆప్ కూడా ఇప్పుడు పోటీలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైలు జీవితాన్ని గడిపిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పై శుక్రవారం విడుదలయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ బయటకు రావడంతో హర్యానా ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంటుంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండడంతో ఇక్కడ ఆప్ పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి ఉండదని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ బయటకు రావడంతో ఆప్ కూడా ఇప్పుడు పోటీలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కావడం హర్యానా ఎన్నికల్లో తమ పార్టీకి మేలు చేస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఢిల్లీ పొరుగునే ఉండే హర్యానాలో అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తొలుత ఆప్ భావించినప్పటికీ పొత్తు చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆప్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. మొత్తంగా 90 సీట్లకుగాను కాంగ్రెస్ పార్టీ 89 చోట్ల బరిలోకి దిగుతుండగా ఒక స్థానాన్ని సిపిఎంకు కేటాయించింది. వాస్తవానికి ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు ఆనుకునే హర్యానా ఉంటుంది. అయితే, ఇప్పటి వరకు హర్యానాలో ఆప్ ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేకపోతోంది. ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా ఆప్ హర్యానా రాష్ట్రంలో సాధించలేదు. ఈసారి ఎలాగైనా కొన్ని సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఆప్ బరిలోకి దిగుతోంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని తొలుత ఆప్ భావించింది. పొత్తు చర్చలు కుదరకపోవడంతో సింగిల్ గా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. దీంతో 40 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా కీలకంగా మారాలని ఆప్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని బలమైన అభ్యర్థులను ఆయాస్థానాల్లో ఆ పార్టీ నిలబెట్టింది.
2019 ఎన్నికల్లో 46 సీట్లలో పోటీ చేసిన ఆప్ ఒక్క శాతం కూడా ఓట్లు సాధించలేక పోయింది. నోటా కంటే కొన్ని ఎక్కువ ఓట్లు మాత్రమే సాధించింది. ఈసారి ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారడం, నిన్నటి వరకు కేజ్రీవాల్ జైల్లో ఉండడంతో హర్యానా ఎన్నికల్లో ఆప్ ప్రచారాన్ని భుజాన మోసేది ఎవరనే ప్రశ్న ఆ పార్టీ శ్రేణులను వేధించింది. ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు రావడంతో ఎన్నికల్లో పోరాటానికి ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రసంగాలు, సూటి ప్రశ్నలు ఓట్లు రాలుస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కొందరు కార్యకర్తలు అయితే ఆయన ఎన్నికల ముఖచిత్రాన్ని మారుస్తారని పేర్కొంటున్నారు. హర్యానా ఎన్నికల బాధ్యత మొత్తాన్ని కేజ్రీవాలే మోస్తారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. కేజ్రీ విడుదల హర్యానాలో పార్టీకి పునరుత్తేజం చేస్తుందని మరో నాయకుడు పేర్కొన్నారు. వివిధ కీలక అంశాలపై ఇప్పటి వరకు పార్టీ విధానాలను స్పష్టంగా చెప్పలేకపోయామని, ఇకపై ఆ బెంగ ఉండదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా అరవింద్ కేజ్రీవాల్ విడుదల ఆప్ కు బలాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేజ్రీవాల్ విడుదలకు ముందు వరకు కాంగ్రెస్, పార్టీ బిజెపి మధ్య హర్యానాలో పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అనూహ్యంగా అరవింద్ కేజ్రీవాల్ బయటకు రావడంతో ఆయన ఈ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇండి కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, ఆప్ కలిసి బరిలోకి దిగితే మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని, కానీ వేరువేరుగా పోటీ చేస్తుండడంతో అది బిజెపికి లాబించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.