మరో యుద్ధం జరగబోతుందన్న సంకేతాలు ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే హమాస్ - ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతోంది. మరో యుద్ధం తప్పదనే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇరాన్ లో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా హత్యతో రగిలిపోతున్న ఆదేశం ఇజ్రాయిల్ పై దాడికి సిద్ధమవుతోంది. మిత్ర దేశాలతో కలిసి విరుచుకుపడే ఆలోచన చేస్తోంది.
ఇజ్రాయిల్ - ఇరాన్
గడచిన మూడేళ్లుగా రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొనగా.. ఆయా దేశాల్లో వేలాదిమంది సైనికులు ప్రజలు మృత్యువాత చెందడంతోపాటు లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఈ దేశాల మధ్య యుద్ధాన్ని నిలిపి వేసేందుకు భారత సహ అనేక దేశాలు సాగిస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతోనే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. మరో యుద్ధం జరగబోతుందన్న సంకేతాలు ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే హమాస్ - ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతోంది. మరో యుద్ధం తప్పదనే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇరాన్ లో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా హత్యతో రగిలిపోతున్న ఆదేశం ఇజ్రాయిల్ పై దాడికి సిద్ధమవుతోంది. మిత్ర దేశాలతో కలిసి విరుచుకుపడే ఆలోచన చేస్తోంది. ఒకేసారి అందరూ కలిసి దాడి చేయడమా..? లేక..? విడివిడిగా చేయాలా అన్న దానిపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ బద్ధ శత్రువైన అమెరికా ఈ పరిస్థితుల్లో రంగంలోకి దిగుతోంది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి మద్దతు తెలిపారు. అగ్రరాజ్యం అదనపు యుద్ధ నౌకలు, ఫైటర్ జట్లను పంపించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు బాలిస్టిక్ క్షిపణిలను నిరోధించగల క్రూయుజర్లు, యుద్ధ విమానాలను తరలించేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న విమాన వాహక యూఎస్ఎస్ థియోడర్ రూజ్వెల్ట్ స్థానంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ను ప్రవేశపెట్టనున్నట్లు పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రినా సింగ్ తెలిపారు. గత మంగళవారం లేబనాన్ రాజధాని బీరూట్ లో తమ కమాండర్ పాద్ షుకర్ ను ఇజ్రాయిల్ హతమార్చడంతో ఉగ్ర సంస్థ హెజ్బెల్లో తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక హానియ హత్యకు భీకరమైన సైనిక ప్రతీకారం తప్పదని యేమెన్ కు చెందిన హూతి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ను హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ ను అడ్డుకునేందుకు పశ్చిమాసియాలో సైనిక శక్తిని పెంచుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. మరోవైపు టెల్ హావీవ్ కు ఎయిర్ ఇండియా సహ పలు విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయల్లోని రాయబార కార్యాలయం కోరింది. ముందు రోజే బీరూట్ లోని భారత రాయభార కార్యాలయం కూడా ఇదే విధమైన హెచ్చరిక చేసింది. వీలైతే లెబనాన్ నుంచి వెళ్లిపోవాలని కూడా కోరింది. మరోవైపు లేబనాన్ లో ఉన్న తమ పౌరులు వెంటనే ఏ టికెట్ దొరికితే ఆ టికెట్లు పట్టుకొని స్వదేశాలకు వచ్చేయాలని అమెరికా, యూకే దేశాలు కూడా ఆ దేశ పౌరులకు సూచించాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుందో అన్న భయం సర్వత్ర నెలకొంది. మరోవైపు ఈ యుద్ధ వాతావరణాన్ని నియంత్రించే దిశగా కొన్ని దేశాలు ప్రయత్నాలను సాగిస్తున్నాయి. ఆయా దేశాల ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయా అన్నది చూడాల్సి ఉంది.