పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం దిగువన మరో రహస్య గది ఉందన్న ప్రచారం జరుగుతోంది. సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించిన మరింత చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే భాండాగారం దిగున రహస్య గది ఉందన్న ప్రచారం జరుగుతోంది.
పూరీ జగన్నాథుడు ఆలయం
పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం దిగువన మరో రహస్య గది ఉందన్న ప్రచారం జరుగుతోంది. సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించిన మరింత చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే భాండాగారం దిగున రహస్య గది ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీనిని కొంత మంది చరిత్రకారులు కూడా ఉటంకిస్తుండడం గమనార్హం. 192 లో ఆంగ్లేయుల పాలనా కాలంలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు. రత్న భాండాగారం తెరిచిన బిజెపి ప్రభుత్వం సొరంగ మార్గం ద్వారా రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా పూరీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. పూరి రాజు కపిలేంద్ర దేవ్ తూర్పు, దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తమునకు సమర్పించినట్లు చరిత్రలో ఉందని వివరించారు. అప్పటిలో శ్రీ క్షేత్ర భాండాగారం దిగువన స్వరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రాష్ట్ర గదిని నిర్మించినట్లు వెల్లడించారు. ఇందులో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ సంపద వెలకట్టలేనిదని ఆయన చెబుతున్నారు. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన వివరించారు.
ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కల సామ్రాజ్యంపై దాడులు జరిగాయి. ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో దాచినట్లు మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్రదాస్ పేర్కొన్నారు. రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు 1902లో ఆంగ్ల పాలకులు సొరంగం మార్గం ద్వారా ఒక వ్యక్తిని లోపలికి పంపించినట్లు చెబుతున్నారు. ఆ తరువాత అతను ఆచూకీ కూడా తెలియలేదు. దీంతో ఆ ప్రయత్నం అప్పటి ఆంగ్ల పాలకులు విరమించుకున్నట్లు ఈయన వెల్లడించారు. శ్రీ క్షేత్రం ఆవరణలో రహస్య గదుల మార్గాలు ఉన్నాయన్నడానికి ఆధారాలు ఉన్నా వాటిని ఎవరూ కనుగొనలేకపోయారని దాస్ వివరించారు. ప్రస్తుతం చరిత్రకారులు చెబుతున్న అంశాలను బట్టి మరింతగా పూరీ రత్న బాండాగారంపైన చర్చ జోరుగా సాగుతోంది. రత్న భాండాగారం దిగువన మరో రహస్యగది ఉందన్న చరిత్రకారుల విశ్లేషణలు నేపథ్యంలో ఒడిస్సాలోని బిజెపి ప్రభుత్వం దీనిపై ఏవిధంగా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది.