||ఆంధ్రజ్యోతి కార్యాలయం||
సందు దొరికితే చాలు తెలంగాణపై, తెలంగాణ సమాజంపై ఎప్పుడు విషం కక్కుదామా అని చూసే ఆంధ్రజ్యోతి యాజమాన్యం మరోసారి తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది. ఇప్పటికే తెలంగాణ ప్రగతిపై విషపు రాతలు రాసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నది. ఇప్పుడు తన ప్రతాపాన్ని తెలంగాణ జర్నలిస్టులపైనా చూపుతోంది. విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యే తెలంగాణ జర్నలిస్టుల కోసం కొత్తగా ఒక హౌజింగ్ సొసైటీ ఏర్పడింది. దానికోసం 8 సంవత్సరాల జర్నలిస్టు అనుభవం ఉండాలని నిబంధన ఉంది. దాంతో గతంలో ఆంధ్రజ్యోతిలో పనిచేసి బయటికి వెళ్లిన ఉద్యోగులంతా ఆంధ్రజ్యోతి హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే, అపాయింట్‌మెంట్ లెటర్‌లో సంస్థ నుంచి మానేయటానికి మూడు నెలల ముందే నోటీస్ పీరియడ్ ఇవ్వాలని నిబంధన ఉంది. ఆంధ్రజ్యోతిలో నెలంతా కష్టపడితే, మరుసటి నెలలో 11వ తారీఖున జీతం ఇస్తారు. దాంతోనే నెలంతా నెట్టుకురావాలి. ఇలాంటి పరిస్థితుల్లో చిరు ఉద్యోగులు ఎంతోమంది సంస్థను వీడి వేరే మీడియా సంస్థల్లో చేరారు. కేవలం తమ డిపార్ట్‌మెంట్ హెడ్‌కు రిజైన్ లెటర్ ఇచ్చి వెళ్లిపోయినవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్లకు ఎలాంటి సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం గమనార్హం.
అదీకాక, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ మధ్య తెలంగాణ ప్రగతిపై విషపు రాతలు రాసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోమని ఖరాఖండీగా చెప్పారు. దీంతో ఎలాగూ తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోదని ఫిక్స్ అయిన ఆంధ్రజ్యోతి యాజమాన్యం.. తెలంగాణ జర్నలిస్టులకు కూడా ఇళ్లు దక్కకుండా చేసేందుకు సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోందని బాధిత జర్నలిస్టులు చెప్తున్నారు. పైగా, సర్వీస్ సర్టిఫికెట్ కోసం వెళ్తే పాత ఫైల్ ముందరేసి, నోటీస్ పీరియడ్ ఇవ్వనందున డబ్బు కట్టి సర్టిఫికెట్ తీసుకెళ్లాలంటూ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ వాళ్లు డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ హెడ్ మురళి అనే వ్యక్తి పాత ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని బాధిత జర్నలిస్టులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమతో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయించుకున్న సంస్థ.. తాము పనిచేసిన రోజులకు సర్టిఫికెట్ ఇవ్వటానికి తిప్పలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి తెలుగు జర్నలిజంలో ప్రతి మీడియా సంస్థలో నెల పాటు నోటిస్ పీరియడ్ ఇవ్వాలన్న నిబంధన ఉంది. కానీ, ఆయా మీడియా సంస్థలు ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని, ఆ నోటీస్ పీరియడ్‌ను నామమాత్రం చేసి, అవసరమైన సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. కానీ, ఆంధ్రజ్యోతి యాజమాన్యం మాత్రం ఏ మాత్రం జాలిలేకుండా ఉద్యోగులను పీక్కుతింటోందని, సర్వీస్ సర్టిఫికెట్ కావాలంటే పైవాళ్లు చెప్పాలి, కింది వాళ్లు చెప్పాలి అంటూ, డబ్బు డిమాండ్ చేస్తూ తిప్పుతూ నరకం చూపిస్తోందని బాధిత ఉద్యోగులు పేర్కొంటున్నారు.