రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న ఘర్షణలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. విశాఖలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని విమర్శించిన లోకేష్.. రాష్ట్రంలో వైసిపి రౌడీయిజానికి పాల్పడుతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న ఘర్షణలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. సామాజిక మాధ్యమాలు వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలపై ఆయన స్పందించారు. విశాఖలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని విమర్శించిన లోకేష్.. రాష్ట్రంలో వైసిపి రౌడీయిజానికి పాల్పడుతోందని ఆరోపించారు. టిడిపికి ఓటు వేశారని దాడులు చేయడం దుర్మార్గమని, ఈ తరహా దాడులను తాను ఖండిస్తున్నానని లోకేష్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఓడిపోతోందని, ఓటమి ఖాయమని తెలిసిన తర్వాతే ఆ పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని లోకేష్ స్పష్టం చేశారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగ పడుతుండడం దారుణమన్నారు. ఇవి మహిళలపై జరిగిన దాడులు కాదని, ప్రజాస్వామ్యంపైనా జరిగిన దాడిగా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులను, ఘర్షణ పూరిత వాతావరణాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యతను పోలీసులు తీసుకోవాలని ఈ సందర్భంగా లోకేష్ సూచించారు. విశాఖలో ఒక కుటుంబంపై వైసీపీ నాయకులు దాడి చేశారంటూ.. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలను లోకేష్ పోస్ట్ చేశారు. ఇది ఎలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న దాడులను నియంత్రించడంపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే దాడులకు కారణమవుతున్న వారిని హౌస్ అరెస్టు చేయడంతోపాటు వారి అనుచరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కీలక నాయకులను ఇతర ప్రాంతాలకు తరలించడం ద్వారా గొడవలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు.