రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సంబంధించిన పోలింగ్ అనంతరం గొడవలు జరిగిన జిల్లాలకు ఈసీ నూతన అధికారులను నియమించింది. గొడవలను నియంత్రణించడంలో విఫలమైన పలువురు అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్త అధికారులను తాజాగా ఈసీ నియమించింది.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ గొడవలను నియంత్రించడంలో విఫలమైన పలువురు అధికారులను ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరు స్థానంలో కొత్త అధికారులను ఈసీ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమితులయ్యారు. అలాగే తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ ను ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా లత్కర్ శ్రీ కేస్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో గొడవలు అదుపులోకి వస్తున్నాయి. ఎన్నికల అనంతరం జరిగిన గొడవలపై పూర్తిస్థాయి విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రతీకార దాడులకు అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను కూడా రాష్ట్రంలోకి దించుతున్నారు. తాజాగా సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్త అధికారులు నియమించడం ద్వారా గొడవలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు అవకాశం ఉంది. గొడవలకు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు సంబంధించిన వివరాలను ఇంటిలిజెంట్స్ వర్గాలు ఇప్పటికే పోలీస్ అధికారులకు అందించాయి.