రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీన ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ అధికారులు పోలీస్ శాఖకు సమాచారాన్ని అందించారు.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అధికార వైసిపి, ప్రతిపక్ష కూటమి పార్టీల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఈ ఘటనలను నియంత్రించాల్సిన పోలీస్ అధికారులు పట్టనట్టు వ్యవహరించడంతో ఈసీ సీరియస్ అయింది. పలువురు పోలీస్ అధికారులను సస్పెండ్ కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీన ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ అధికారులు పోలీస్ శాఖకు సమాచారాన్ని అందించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా ప్రతికార దాడులకు అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్పీ బలగాలను, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను కూడా మోహరించాల్సిందిగా ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర పోలీస్ అధికారులకు సూచించింది. రాష్ట్రంలోని ఆయా జిల్లాల ఎస్పీలకు ఈ మేరకు సమాచారాన్ని ఇంటెలిజెన్స్ అందించడం గమనార్హం. ఎన్నికల పోలింగ్ అనంతరం ప్రారంభమైన గొడవలు ఇప్పుడిప్పుడే సద్దుమనుగుతున్నాయి. అనంతపురం, పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంతోపాటు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను ఇతర ప్రాంతాలకు వెళ్లేలా పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటిలిజెన్స్ వర్గాలు జారీ చేసిన హెచ్చరికలు సర్వత్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయకపోతే పెద్ద ఎత్తున గొడవలకు ఆస్కారం ఉంటుందన్న భావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన బాధ్యత ప్రస్తుతం పోలీస్ శాఖపైనే ఉంది.