మాచర్ల నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన మభ్యంతర ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. జూన్ ఆరో తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
మాచర్ల నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన మభ్యంతర ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. జూన్ ఆరో తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఆయన కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతోపాటు నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఆయన వెంట నలుగురు వ్యక్తులకు మించి ఉండకూడదని తేల్చి చెప్పింది. ఆయన దర్యాప్తుకు ఆటంకం కలిగించడంగానీ, సాక్షులను బెదిరించడంగానీ చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికు ఊరట లభించినట్టు అయింది. గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్రంలో పిన్నెల్లి కేంద్రంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇతర ప్రాంతాలకు పారిపోయారంటూ, కోర్టు ఎదుట లొంగిపోతున్నారంటూ, పోలీసులు అరెస్టు చేశారంటూ పెద్ద ఎత్తున జరిగిన ప్రచారానికి హైకోర్టు తీర్పు ముగింపు ఇచ్చినట్లు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పిన్నెల్లి వ్యవహారం ఎటువైపు వెళుతుందో అన్న ఆసక్తి సర్వత్ర కనిపించింది. హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో మరో 15 రోజులపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అధికార వైసిపికి భారీ ఊరటగానే చెప్పాలి. ఫలితాలకు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి బలమైన వ్యక్తి అరెస్ట్ అయితే.. పల్నాడు ప్రాంతంలో ఆ పార్టీ క్యాడర్ నిరుత్సాహంలో కూరుకుపోయేది. ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.