ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం.. హాజరైన అతిరథ మహారథులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు నాలుగో సారి బాధ్యతలు చేపట్టారు. కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు.

chandrababu naidu

ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు

అమరావతి, ఈవార్తలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు నాలుగో సారి బాధ్యతలు చేపట్టారు. కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. చంద్రబాబు చేతుల మీదుగా ప్రమాణం చేయించారు. చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులుగా పవన్ కల్యాణ్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌, పీ నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌ యాదవ్‌, నిమ్మల రామానాయుడు, ఎన్‌.ఎమ్‌.డి.ఫరూక్‌, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారధి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్‌, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్‌ రెడ్డి, టీజీ భరత్‌, ఎస్‌.సవిత, వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, మండిపల్లి రామ్‌ ప్రసాద్‌రెడ్డి, నారా లోకేశ్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, పన్నీర్ సెల్వం, ప్రఫుల్ పటేల్, చిరాగ్ పాశ్వాన్, సినీనటులు చిరంజీవి, రజనీకాంత్, చంద్రబాబు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బాలకృష్ణ కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు. కాగా, కేసరపల్లిలో సభ కోసం 11 ఎకరాలను సిద్ధం చేశారు. 36 గ్యాలరీల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. నాలుగు గ్యాలరీల్లో వీఐపీలు కూర్చొన్నారు. చంద్రబాబు ప్రమాణానికి 10 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఒక్క విజయవాడలోనే 3 వేల మందిని కేటాయించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు, పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణంలోపల, బయట 7 వేల మంది విధుల్లో ఉన్నారు. ఇందులో 60 మంది ఐపీఎస్‌లు ఉన్నారు.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్