ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రారంభంతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలు కౌంటింగ్ ప్రారంభించనున్నారు.
ఎన్నికల కౌంటింగ్‌కు అంతా రెడీ
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రారంభంతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలు కౌంటింగ్ ప్రారంభించనున్నారు. 175 నియోజకవర్గాల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 25 పార్లమెంట్ స్థానాలు పరిధిలో 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో 46 మంది పోటీ పడగా, అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారు. విశాఖ పార్లమెంట్ స్థానంలో అత్యధికంగా 12 మంది పోటీ పడ్డారు. తొలి ఫలితం నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ వర్గాలకు సంబంధించి రానుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలు 13 రౌండ్లతో వెలువడనుంది. రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో అత్యధికంగా 29 రౌండ్లు ఉన్నాయి. ఈ రెండు ఫలితాలు చివరిగా రానున్నాయి. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. రాత్రి 8 గంటలు నుంచి 9 గంటలు మధ్య అన్ని నియోజకవర్గాల్లో తుది ఫలితాలు వెలువడేలా చర్యలు చేపట్టినట్టు ఎన్నికల సంఘ అధికారులు చెబుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3.33 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల అధికారి మీనా తెలిపారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. 26,473 మంది హోమ్ ఓటింగ్ వేశారు. 26,721 మంది సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్టు మీనా వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అబ్జర్వర్లను నియమించినట్టు తెలిపారు.