కూటమి నేతలు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి పీఏలు, కార్యకర్తలకు హెచ్చరిక జారీ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, ఈవార్తలు : కూటమి నేతలు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి పీఏలు, కార్యకర్తలకు హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియాలో అందరూ జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. వైసీపీ నాయకులు కొందరిని పోలీసులు అరెస్టు చేశారని, వారంతా సోషల్ మీడియాలో రెచ్చిపోయారని తెలిపారు. అందుకే వారిని పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. అయితే, ఈ అరెస్టులు కేవలం వైసీపీ నేతలకే కాదని.. మహిళలు, ఇంట్లో వాళ్లను అవమానించేలా, వారు నొచ్చుకునేలా ఎవరు కామెంట్లు చేసినా, పోస్టులు పెట్టినా వదిలేది లేదని తేల్చి చెప్పారు.
సోషల్ మీడియాపై నిఘా పెడతామని, ఈ విషయంలో తాను పారదర్శకంగా ఉంటానని చంద్రబాబు తెలిపారు. కూటమి నాయకులు అయినా సరే ఊరుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. అందరు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.