||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, వెదర్ న్యూస్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని చెప్తూ, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
అటు.. తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వానలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వర్షాలు 8వ తేదీ నాటికి కాస్త తగ్గి, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా కురుస్తాయని పేర్కొంది.