రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నైపుణ్య గణనను కొద్ది రోజుల్లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగితను తగ్గించే ఉద్దేశంతో నైపుణ్య గణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ సెన్సెస్ చేపడతామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నైపుణ్య గణనను కొద్ది రోజుల్లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగితను తగ్గించే ఉద్దేశంతో నైపుణ్య గణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ సెన్సెస్ చేపడతామని హామీ ఇచ్చారు. నైపుణ్య గణన ద్వారా యువతలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి అందుకు అనుగుణమైన శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణన ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో నైపుణ్య గణన చేపట్టే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కూడా పూర్తయింది. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఈ నైపుణ్య శిక్షణను చేపట్టనున్నారు. రెండు రకాలుగా నైపుణ్య గణన చేయనున్నారు.
ఇందులో మొదటిది సచివాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి వారి వివరాలను సేకరిస్తారు. డెమోగ్రాఫిక్ ప్రొఫైల్, విద్యార్హతలు, నైపుణ్య వివరాలు, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వివరాలను నమోదు చేయనున్నారు. ఈ వివరాలను నైపుణ్యం అనే యాప్ లో క్షేత్రస్థాయి సర్వే చేసే సిబ్బంది అప్లోడ్ చేస్తారు. అలాగే, ఎవరికి వారే వ్యక్తిగతంగా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వివరాలను అప్లోడ్ చేయడం. ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు ఈ ప్రక్రియను తమ స్మార్ట్ ఫోన్ లో నైపుణ్యం అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ వివరాలను అప్లోడ్ చేయవచ్చు. మొత్తం ఈ వివరాలను సేకరించిన తర్వాత ప్రభుత్వం కేటగిరీల వారీగా విభజించి వారికి అవసరమైన నైపుణ్య శిక్షణను అందించనున్నారు. రాష్ట్రస్థాయిలో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీరికి శిక్షణతో పాటు ఉద్యోగాలను కల్పించనున్నారు. ఏడాది చివరినాటికి నైపుణ్య గణన పూర్తి చేసి వచ్చే ఏడాది చివరి నాటికల్లా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెలాఖరులో నైపుణ్య గణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వచ్చేనెల చివరనాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో నైపుణ్య గణన చేపట్టాల్సిన సిబ్బందికి శిక్షణ పూర్తి చేసి అధికారులు సిద్ధంగా ఉంచారు.