అనేక మంది రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు భూ భారతి (Bhu Bharati) పరిష్కారం చూపుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో భూ భారతిపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈవార్తలు, మల్యాల: అనేక మంది రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు భూ భారతి (Bhu Bharati) పరిష్కారం చూపుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో భూ భారతిపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో సమస్యలకు కారణమైన ధరణి స్థానంలో భూ భారతిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వెల్లడించారు. రైతులు పారదర్శకంగా, వేగంగా తమ భూ వివరాలు తెలుసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, వారసత్వ నమోదు లాంటి సౌకర్యాలు పొందేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. మొత్తంగా దీర్ఘకాల భూ సమస్యలకు భూ భారతి శాశ్వత పరిష్కారం చూపుతుందని తెలిపారు. ధరణిలో భూ సమస్యల కోసం అప్పీల్ వ్యవస్థ లేదని, కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఉండేదని.. భూ భారతిలో రెండంచెల అప్పీల్ వ్యవస్థను తీసుకొచ్చామని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. భూ భారతి ద్వారా హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కలుగుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చెయ్యడానికి ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ, పెండింగ్ సాదా బైనామా ధరఖాస్తుల పరిష్కారం, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ, భూమి హక్కులు ఏవిధంగా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు, పాసుపుస్తకాలలో భూమి పటం, భూ సమస్యల పరిస్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ, భూధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవిన్యూ రికార్డుల నిర్వహణ, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైన ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్స్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం తదితర అంశాలపై వివరణ ఇచ్చారు.
భూ సమస్యలపై అప్పీల్ వ్యవస్థ
భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. తహసీల్దారు చేసిన మ్యుటేషన్లపై / తహసీల్దారు జారీ చేసిన పాసుపుస్తకాలు / భూదార్‌పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి తీర్పుపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు రెండో అప్పీల్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఆర్డీవో చేసిన మ్యుటేషన్లు, సాదాబైనామాల క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చని వివరించారు. జిల్లా కలెక్టర్ తీర్పుపై అభ్యంతరాలు ఉన్నా భూమి ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మల్యాల ఎమ్మార్వో మునిధర్, ఎంపీడీవో స్వాతి, ముత్యాల రాంలింగారెడ్డి, రైతుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.