విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, ప్లాంట్ పరిరక్షణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మిక సంఘాలు, కార్మికులు, ప్లాంట్ పరిరక్షణ కమిటీలతోపాటు వైసిపి సైతం రాజకీయంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తోంది. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగడుతూ ఇప్పటికే కార్మిక సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైన ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
జన జాగరణ సమితి ఏర్పాటు చేసిన ప్లెక్సీలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, ప్లాంట్ పరిరక్షణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మిక సంఘాలు, కార్మికులు, ప్లాంట్ పరిరక్షణ కమిటీలతోపాటు వైసిపి సైతం రాజకీయంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తోంది. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగడుతూ ఇప్పటికే కార్మిక సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలను గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైన ఘటన విశాఖలో చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ లక్షలాదిమంది ఉక్కు కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్న ఈ ముగ్గురు మోసగాలను శిక్షించండి అంటూ A1 చంద్రబాబు నాయుడు, A2 పురందేశ్వరి, A3 పవన్ కళ్యాణ్ అంటూ ఫ్లెక్సీలు విశాఖ నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో వెలిశాయి. వీటిని జన జాగరణ సమితి ఆధ్వర్యంలో నగర పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులు ఈ ఫ్లెక్సీలను తొలగించే పనుల్లో పడ్డారు. ప్రస్తుతం దీనిపై విశాఖ నగర పరిధిలో జోరుగా చర్చ జరుగుతోంది.
కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతుందని గట్టి నమ్మకంతో కార్మికులు, రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారని, తీరా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ 70 శాతం మూతపడేలా కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని పలువురు కార్మికులు విమర్శలు చేస్తున్నారు. కార్మికులను పొమ్మనలేక బలవంతంగా పొగ పెడుతున్నారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తరహా చర్యలకు పాల్పడుతుండడం దారుణం అంటూ పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. దీనిపై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఒక ప్రకటనను విడుదల చేశారు. 'సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ప్రజలకు సెంటిమెంట్ లేదు. అనవసరంగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టవద్దు అంటూ తిరుగులేని మెజారిటీ వల్ల వచ్చిన అహంకారంతో మాట్లాడారు. దీంతో కార్మికులు 1320 రోజుల నుంచి చేస్తున్న పోరాటం గంగలో పోసినట్లయింది. 32 మంది ప్రాణ త్యాగాలు వృధా అయిపోయాయి. తెలుగోడి ఆత్మగౌరవం మంట కలిసిపోయింది. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాచలం అప్పన్న స్వామి. నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వ నాయకులను కఠినంగా శిక్షించాలని కార్మికులు, రాష్ట్ర ప్రజలు వేడుకోవాలి. పవన్ హీరోగా చంద్రబాబు, పురందరేశ్వరి సహాయ నటులుగా ముగ్గురు మోసగాళ్లు అనే కొత్త సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది' అని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.