మాజీ మంత్రి, విశాఖకు చెందిన సీనియర్ నేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీని వీడారు. వైసీపీలో స్వేచ్ఛ లేదని, ఆరు నెలలు గడవక ముందే ప్రభుత్వంపై పోరాటానికి దిగుతుండడం పట్ల విమర్శలు చేస్తూ పార్టీ సభ్యత్వానికి, భీమిలి ఇన్‌చార్జ్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈయన రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు.
గ్రంథి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు
ఏపీలో వైసీపీకి కీలక నేతలు షాక్ ఇస్తున్నారు. వరుసగా ఆ పార్టీని వీడి బయటకు వస్తున్న నేతలు సంఖ్య పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత ముఖ్య నాయకులు పార్టీకి దూరమతున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఎంతో మంది నాయకులు పార్టీని వీడగా.. ఇప్పుడు మరికొంత మంది అదే బాటలో పయనిస్తుండడం ఆ పార్టీ ముఖ్య నాయకులను కలవరపెడుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణ రీతిలో పరాభవాన్ని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. ఐదేళ్లు గడిచిన తరువాత జరిగిన ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయింది. దీంతో వైసీపీలో ఉన్న ఎంతో మంది నాయకుల్లో భవిష్యత్ పట్ల ఆందోళన నెలకొంది. మరికొంత మంది నాయకులను కేసులు, ప్రభుత్వ వేధింపులు ఇబ్బందులకు గురి చేస్తుండడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చి ప్రత్యామ్నాయ మార్గాలు వైపు చూస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, విశాఖకు చెందిన సీనియర్ నేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీని వీడారు. వైసీపీలో స్వేచ్ఛ లేదని, ఆరు నెలలు గడవక ముందే ప్రభుత్వంపై పోరాటానికి దిగుతుండడం పట్ల విమర్శలు చేస్తూ పార్టీ సభ్యత్వానికి, భీమిలి ఇన్‌చార్జ్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈయన రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఈయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విజయం సాధించారు. 2024 ఎన్నికలకు ముందే ఈయన పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది.
ఎన్నికల్లో ఓటమి తరువాత మాత్రం ఈయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కొద్దిరోజులు కిందట ఈయనకు సంబంధించిన ఆస్తులపై ఈడీ దాడులు చేసిన నేపథ్యంలో ఈయన పార్టీ మారతారన్న ప్రచారం జోరుగానే సాగింది. తాజాగా గురువారం ఈయన కూడా పార్టీకి రాజీనామా చేశారు. మరికొంత మంది వీరి బాటలోనే పయనిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నానితోపాటు వాసిరెడ్డి పద్మ వంటి నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఎన్నికలు తరువాత నుంచి సైలెంట్ అయిపోయిన నేతలు కూడా జంప్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, ఉభయ గోదావరి జిల్లాల్లోని మరికొందరు సీనియర్ నేతలు వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. తాజా పరిణామాలు వైసీపీకి ఇబ్బందిగా మారుతున్నాయి. అయితే, అధికారానికి అలవాటుపడిన నేతలే పార్టీ నుంచి బయటకు వెళుతున్నారని, పార్టీ ఓటమి పాలైనప్పటికీ కేడర్ పార్టీతోనే ఉందని, తమ పార్టీకి వచ్చిన ఓటు బ్యాంకే దీనికి నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వరుసగా ముఖ్య నాయకులు పార్టీ వీడుతుండడంతో జగన్ వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారా..? అన్నది చూడాల్సి ఉంది.