తెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఏకంగా 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టులు ఆయుధాలు వీడారు.
ప్రతీకాత్మక చిత్రం
డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగుబాటు
ఇద్దరు తెలంగాణ, 39 మంది ఛత్తీస్‌గఢ్ వాసులు
హైదరాబాద్, డిసెంబర్ 19 (ఈవార్తలు): తెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఏకంగా 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టులు ఆయుధాలు వీడారు. మావోయిస్టులు లొంగిపోవడాన్ని డీజీపీ శివధర్ రెడ్డి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 24 ఆయుధాలతో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన 41 మందిలో ఇద్దరు తెలంగాణ వారు కాగా, 39 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారున్నారని వివరించారు. తెలంగాణకు చెందిన వారిలో.. కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్ ఉన్నారని తెలిపారు. ఏకే-47లు 3, ఎల్‌ఎమ్‌జీ 1, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు 5, ఇన్సాస్ రైఫిళ్ళు 7, బీజీఎల్ గన్ 1, 303 రైఫిళ్ళు 4, సింగిల్ షాట్ రైఫిల్ 1 , ఎయిర్ గన్స్ 2 మొత్తం 24 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ సభ్యులకు రూ. 4 లక్షలు, సభ్యులకు రూ.4 లక్షల రివార్డు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయుధాలతో లొంగిపోతే వారికి మరింత నగదును రివార్డ్స్ కింద అందజేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. మెుత్తం 41 మందికి కోటి 47 లక్షల రివార్డ్స్ అందిస్తున్నామని... తక్షణ సహాయం కింద రూ.25 వేలు ఇస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తం 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. తెలంగాణకు చెందిన 54 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే వీరిలో 5 మంది సెంట్రల్ కమిటీలో ఉండగా, 8 మంది స్టేట్ కమిటీలో ఉన్నట్లు చెప్పారు. వీరితోపాటు 13 మంది డివిజన్ కమిటీ , 12 మంది కిందిస్థాయిలో సభ్యులుగా ఉన్నట్లు వివరించారు. మెుత్తం 54 మందిలో 48 మంది వేరే రాష్ట్రాల్లో పని చేస్తుండగా, ఏడుగురు తెలంగాణలో ఉన్నట్లు గుర్తించామని ప్రకటించారు.