Revanth Reddy | రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్‌గా మిగిలిపోతారా..?

చాలా మంది అనుకున్నట్లు రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్‌గా మిగిలిపోతారా? అన్న సందేహమూ కలుగుతోంది. చరిత్రలో ఎందరో సీఎంలు తమదైన శైలిలో పాలన చేసి రాజకీయాల్లో తమ మార్కును చూపెట్టారు. వారికంటూ ఒక విజన్ ఉండబట్టే ఇదంతా.

revanth reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి. రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు వరకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనీ.. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎవరూ అనుకోలేదు. కలలో కూడా ఊహించుకోలేదు. కాంగ్రెస్ వచ్చినా దళితుడే ముఖ్యమంత్రి అవుతారని అంతా అనుకున్నారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది మొదలు.. బీజేపీ రేస్‌లో వెనుకబడుపోయింది. కాంగ్రెస్ రెండో స్థానానికి వచ్చి చేరింది. కేసీఆర్‌పై ఉన్న కోపాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియని ప్రజలు.. కాంగ్రెస్ వైపు మళ్లారు. అప్పటిదాకా బీజేపీయే ప్రత్యామ్నాయం అనుకున్న ప్రజలకు బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనన్న భావన కలిగింది. దాంతో ఓట్లు హస్తం పార్టీ చేజిక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఓ సందర్భంలో రేవంత్ ఓ చానల్‌తో మాట్లాడుతూ.. ‘కొండారెడ్డిపల్లి నుంచి 150 రూపాయలతో వచ్చిన. ఇప్పుడు సీఎం అయిన. తెలంగాణ రెండో ముఖ్యమంత్రి అన్న పేరైతే వచ్చింది. నాకు అది చాలు. ఇప్పుడు దిగిపోయినా నాకేం పోయేది లేదు’ అని వ్యాఖ్యానించారు.

ఈ మాటలు వెంటే సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి మాట్లాడే మాటలు కాావు. చాలా మంది అనుకున్నట్లు రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్‌గా మిగిలిపోతారా? అన్న సందేహమూ కలుగుతోంది. చరిత్రలో ఎందరో సీఎంలు తమదైన శైలిలో పాలన చేసి రాజకీయాల్లో తమ మార్కును చూపెట్టారు. వారికంటూ ఒక విజన్ ఉండబట్టే ఇదంతా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ అనగానే రూ.2కు కిలో బియ్యం, చంద్రబాబు అనగానే ఐటీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనగానే ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనగానే రైతుబంధు, కాళేశ్వరం లాంటివి గుర్తుకొస్తాయి. వీళ్లంతా తమకంటూ ఓ స్టాంప్ వేసుకున్నారు.

మరి రేవంత్ రెడ్డి తన పాలనలో ఏం చేద్దామనుకుంటున్నారు? కక్ష రాజకీయాలా? తెలంగాణపై కొందరి గుర్తులు చెరిపేయాలన్న కాంక్షా? నాకేం పోయేది లేదు అన్న వ్యాఖ్యలు సిగ్గు విడిచి మాట్లాడినట్టే. ఓ విజన్ అంటూ ఉండాలి. ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఉండాలి. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకోవాలి. అందరిలా గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఉండొద్దు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను ఓడించి సీఎం పీఠంపై కూర్చున్న రికార్డు రేవంత్‌ది. ఆ రికార్డుకు తగ్గట్టు పాలన సాగించాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి. సంక్షేమ పథకాలు తీసుకురావాలి.. రాష్ట్రాభివృద్ధికి కొత్త ఆలోచనలు చేయాలి. అంతేకానీ.. ప్రతీదానికి విధ్వంసం అన్న మాటలతో కాలం గడిపితే ఏం లాభం. చరిత్రలో ఓ విఫల ముఖ్యమంత్రిగా మిగిలిపోవడం తప్ప.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్