ఏపీలో జగన్ రెడ్డి.. తెలంగాణలో రేవంత్ రెడ్డి.. ఎందుకీ సమాంతర వ్యవస్థలు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana)లో ఆయా అధికార పార్టీలు కొత్తగా జొప్పిస్తున్న వ్యవస్థలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ (Volunteers) .. తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు (Indiramma Committees).. ఈ రెండూ ఒక విధంగా ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థలే.

jagan revanth
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్

తెలుగు రాష్ట్రాల్లో పాలకులకు ప్రభుత్వ అధికారులపై నమ్మకం సన్నగిల్లుతోందా? లేక ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా? వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారా? లేక ప్రభుత్వ అధికారులకు చేతకావటం లేదా? అంటే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana)లో ఆయా అధికార పార్టీలు కొత్తగా జొప్పిస్తున్న వ్యవస్థలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ (Volunteers) .. తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు (Indiramma Committees).. ఈ రెండూ ఒక విధంగా ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థలే. ప్రభుత్వాన్ని పాలకులు నడిపించినా, అమలు చేసేది మాత్రం ప్రభుత్వ అధికారులే. కానీ, ఈ వ్యవస్థలు ప్రభుత్వంలో చొరబడి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే సాధనాలే. ‘ప్రభుత్వ అధికారుల చేతగానితనానికి నిదర్శనం’ వల్లే ఈ వ్యవస్థలను తీసుకొస్తున్నారని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే.. ప్రభుత్వ వ్యవస్థనే వారి చేతుల్లో పెట్టేయొచ్చు కదా. ఇంతకుముందు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు నడిపించలేదా? అర్హులను గుర్తించి వారికి ఫలాలు అందజేయలేదా? అంటే అంతా సవ్యంగానే జరిగింది.

కానీ, కొత్తగా ఈ వ్యవస్థలు ఎందుకు? అంటే సంక్షేమ పథకాల వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికేనని సుస్పష్టంగా అర్థం అవుతోంది. పచ్చిగా చెప్పాలంటే.. తమకు ఓటేసినవారికి మాత్రమే సంక్షేమ ఫలాలు అందాలన్న నిర్ణయం కూడా కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లు గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లదే పైచేయి అయ్యింది. ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా.. వాలంటీర్‌ను పిలవటం, వారితోనే ప్రజల స్థితిగతులు తెలుసుకోవటం జరిగింది. అంటే వాలంటీర్లు ప్రభుత్వ అధికారుల కన్నా ఎక్కువేనా! ఓ రకంగా అధికారులపైనా పెత్తనం చెలాయించటం అన్న మాటే.

ఇక.. ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ కమిటీల్లో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారికే ప్రాధాన్యం ఉంటుందనీ ప్రకటించారు. ఈ కమిటీల్లో ఉండే సభ్యులు ఏం చేస్తారయ్యా అంటే.. సంక్షేమ పథకాల అర్హులను గుర్తిస్తారట. ఇక్కడే అసలు కిటుకు ఉంది. వేరే పార్టీల్లో ఉన్న అర్హులను కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించగలరా? వారికీ పథకాల ఫలాలు అందజేస్తారా? ‘ఎలక్షన్స్‌లో నువ్వు మా పార్టీకి మద్దతు ఇవ్వలేదు. నీకెందుకు పథకాలు అందించాలి?’ అని అనరు అన్న గ్యారెంటీ రేవంత్ రెడ్డి ఇస్తారా? ఇక్కడ కూడా అంతే.. ప్రభుత్వ అధికారుల అధికారాలను కత్తిరించేందుకే ఇందిరమ్మ కమిటీలు అన్నది అవగతం అవుతోంది.

తమకు భారం తగ్గిందని ప్రభుత్వ అధికారులు ఇప్పటికిప్పుడు ఊపిరి పీల్చుకున్నా, రాబోయే రోజుల్లో సమాంతర వ్యవస్థలు ఏర్పడి అధికార వ్యవస్థ నీరుగారిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకు ఏపీలో జరుగుతున్న పరిణామాలను కళ్ల ముందే చూస్తున్నాం. ఈ వ్యవస్థలు ఎందుకు? అని అడిగితే.. గతంలో సంక్షేమ పథకాలు అర్హులకు అందలేదు.. తాము దాన్ని సవరిస్తున్నాం అని పాలకులు చెప్తారు. కానీ, ఈ వ్యవస్థల ఏర్పాటు నిర్ణయం వెనుక ఎంత పెద్ద మతలబు ఉందో అధికారులు అర్థం చేసుకోవాలి. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమో.. ఒక తెలంగాణ రాష్ట్రమో అని కాదు. ప్రభుత్వ పాలనలోకి అధికార పార్టీ వ్యవస్థల చొరబాటు.. ఆయా అధికార వ్యవస్థలను నీరుగార్చే ఉద్దేశమే అవుతుంది. ఇది ప్రభుత్వ అధికారులకు వేకప్ కాల్ కావాలి.

- శివవాణి

వెబ్ స్టోరీస్