స్థానిక ఎన్నికలు ఇదిగో అదిగో అంటూ కాలం గడిపేస్తున్నారు. ఇప్పటికైతే ఎప్పుడు ఎన్నికలు జరుపు తారన్న గ్యారెంటీ లేదు. తమకు పరిస్థితలు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్న ధోరణిలో తెలుగు వల్లభులు లెక్కలు వేసుకుంటున్నారు.
స్థానిక ఎన్నికలపై చిన్న చూపు
స్థానిక ఎన్నికలు ఇదిగో అదిగో అంటూ కాలం గడిపేస్తున్నారు. ఇప్పటికైతే ఎప్పుడు ఎన్నికలు జరుపు తారన్న గ్యారెంటీ లేదు. తమకు పరిస్థితలు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్న ధోరణిలో తెలుగు వల్లభులు లెక్కలు వేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితుల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో మంచి మెప్పు పొందేలా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఎవరు అధికారంలోకి వచ్చినా స్థానిక సంస్థలను బలోపేతం చేసి, గ్రామాల అభివృద్దికి ప్రణాళికలు రచించడం లేదు. గ్రామస్థాయిలో కూడా పెత్తనం తమ చేతుల్లో ఉండేలా చూస్తున్నారు. వారు విధించే పన్నులను, పనులను వీరే చేస్తున్నారు. దీంతో గ్రామాలు ఆర్థికంగా బలపడడం లేదు. పెత్తనం తమ గుప్పిట్లో పెట్టుకుని సర్పంచ్‌లను డవ్మిూలుగా మర్చారు. గత జగన్ ప్రభుత్వం ఎపిలో సర్పంచ్‌లకు సమాంతరంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలను పెట్టారు. ఇప్పుడు తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామంటున్నారు. రాజీవ్ గాంధీ స్థానిక ప్రభుత్వాల బలోపేతం కోసం తీసుకుని వచ్చిన రాజ్యాంగ సవరణలను తుంగలో తొక్కుతున్నారు. గ్రావిూణ అర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మగా ఉన్న గ్రామలను అభివృద్ధి పరచి, సర్పంచ్‌లను బాధ్యులను చేసేలా కార్యక్రమాలకు రచన జరగడం లేదు.
గ్రామస్థాయి నుంచి ప్రణాళిక సాగివుంటే గ్రామాలు బాగుపడి రాష్ట్రం, దేశం బాగుపడేది. కానీ అలాంటి ఆలోచన కార్యరూపం దాల్చడం లేదు. అన్నీ సచివాలయం నుంచి సిఎంల పర్యవేక్షణలో జరగడం వల్ల గ్రామాలు వట్టిపోవడానికి కారణం అవుతున్నాయి. గ్రామస్థాయి లో ప్రణాళికలు రచించి అమలయ్యేలా కార్యాచరణ సాగడం లేదు. ఆర్థికంగా పంచాయతీలు బలోపేతంగా లేకపోవడంతో పాటు, సర్పంచ్‌లు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల గ్రామాల్లో పక్కాగా ప్రణాళికలు జరగడం లేదు. కేంద్రం నేరుగా నిధులు ఇవ్వడం ద్వారా గ్రామాలను బలోపేతం చేయాలని కేంద్రం ఆలోచన చేసినా అందుకు పాలకులు సిద్దంగా లేరు. వివిధ పథకాలతో చేస్తున్నపెత్తనాన్ని తగ్గించుకోవడం లేదు. గ్రామాలు చేయాల్సిన నిర్ణయాలను సచివాలయ స్థాయిలో తీసుకుంటున్నారు. ఎన్నికైన సర్పంచ్‌లను డవ్మిూలుగా చేస్తూ..వారికి నిధులు కేటాయించకుండా..వారిని పనిచేయనీయ కుండా పెత్తనం చెలాయిస్తున్న తీరు వల్ల గ్రామాల సమగ్ర అభివృద్దికి నోచుకోలేదు. గ్రామాలకు ఏమి అవసరమన్నది గుర్తించి నిధులు విడుదలచేసి, అమలు చేయించేలా కార్యాక్రమాలు సాగివుంటే ఆర్థికవ్యవస్థ ఎప్పుడో బలోపేతం అయ్యేది.
గ్రామాల్లో సర్పంచ్‌లు పటిష్టంగా పనిచేయడంతో పాటు ప్రణాళికలు సిద్దం చేసేలా అధికారులు కార్యాచరణ సిద్దం చేయాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. గ్రామాలను పటిష్ట పాలనా కేంద్రలుగా తీర్చి దిద్దాలి. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి ఉద్యోగులను పనిచేసేలా చేయాలి. అలాగే పనులకు సంబంధించి గ్రామాల్లో తీర్మానం చేయించి అమలు చేయించాలి. సిఎం స్థాయిలో కేవలం పర్యవేక్షణ మాత్రమే ఉండాలి. కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగేలా అవసరమైతే ప్రణాళికలను అమలు చేయాలి. అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలి. గ్రామాలను యూనిట్‌గా కార్యక్రమాల రచన సాగాలి. సర్పంచ్‌లను, గ్రామ వార్డు సభ్యులను బాధ్యులను చేయాలి. అప్పుడే ఏ పథకం అయినా ఆశించన ఫలితం సాధిస్తుంది. ప్రధానంగా పారిశుధ్యం అన్నది పంచాయతీల సామాజిక బాధ్యతగా చేయాలి. స్వచ్ఛత అన్నది వ్యక్తిగతమైన శ్రద్దకు సంబంధించినదే అయినా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇలాంటి శ్రద్ద తక్కువనే చెప్పాలి. ఇప్పటికీ ఆరుబయట మల విసర్జన అన్నది అలవాటుగా కొనసాగుతోంది. నిత్యం టీవీల్లో పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రజల్లో చైతన్యానికి కృషి చేస్తున్నా వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. అనారోగ్యాల బారిన పడుతున్నా ప్రజలు ఇందుకు కారణాలు అపరిశుభ్రత అని గ్రహించడం లేదు.
వ్యక్తిగత మరుగుదొడ్ల కు 12వేల ఆర్థిక సాయం అందిస్తున్నా గ్రామాల్లో ప్రజలు వెంటనే మరుగదొడ్లు నిర్మించు కునేందుకు ముందుకు రావడం లేదు. దీనికి ప్రజలతో పాటు ప్రభుత్వాల వైఫల్యం కూడా ఉంది. గ్రామాలను యూనిట్‌గా చేసి సర్పంచ్‌లకు బాధ్యత అప్పగించి ఉంటే ఇది వందశాతం సక్సెస్ అయ్యి ఉండేది. కానీ గ్రామస్థాయిలో పనులకు సర్పంచ్ లను బాధ్యులను చేయక పోవడం వల్ల కార్యక్రమాలు విజయవంతం కావడం లేదు. గ్రామస్థాయిలో పని ఏదైనా సర్పంచ్‌లకు బాధ్యతలు అప్పగించి గ్రామకమిటీ ద్వారా అమలు చేయాల్సి ఉంది. ఏ గ్రామానికి ఆగ్రామ సర్పంచ్‌ను బాధ్యుడిని చేస్తే సరిపోయేది. దీంతో వ్యవస్థ బలోపేతం అవుతుంది. పారిశుద్యం, వీధులు శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం తదితర అంశాలు సామాజిక బాధ్యత కావాలి. ఈ రకమైన చైతన్యం కోసం ఉద్యమించాల్సి ఉంది. పంచాయతీల్లో జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో పల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రధానంగా అన్ని పనులను ప్రభుత్వమే చేస్తుందన్న ధీమాలో ప్రజలు ఉన్నారు. పరిశుభ్రత లోపించిన కారణంగానే వ్యక్తిగతంగానే గాక పరిసరాల శుభ్రతా లోపించి అతిసారం, కలరా వంటి వ్యాధులు పెచ్చరిల్లుతున్నాయి.
మురుగుకాల్వల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారు లేనందున దుర్వాసన వెదజల్లు తుండటంతో పల్లె ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. రహదారుల్లోనే మురుగు నీరు ప్రవహిస్తుండటం దోమల బెడద తీవ్రం కావడంతో రోగాల బారిన పడుతున్నారు. అనేక అంటురోగాలు ప్రబలుతున్నాయి. మలేరియా, డెంగ్యూ విజృంభిస్తోంది. సర్పంచ్‌లు ఉన్నా లేకున్నా ఈ పనులను పెద్దగా పట్టించుకోవడంలేదు. ఇలాంటి సమస్యలనే ఇప్పుడు అధ్యయనం చేయాలి. గ్రామాలను బలోపేతం చేయాలి. ఓటుబ్యాంక్ రాజకీయాల కారణంగా ప్రజలు అచేతనంగా తయారయ్యారు. వారిని బాధ్యులను చేసేలా చర్యలు ఉండడం లేదు. సర్పంచ్‌లను, పంచాయతీల పాలకవర్గాలను విశ్వాసంలోకి తీసుకుని వారిని బాధ్యులను చేసినప్పుడే గ్రామాల రూపురేఖలు మారగలవు.సర్పంచ్‌లకు పూర్తిస్థాయి అధకారాలను దఖలు పరచాలి. నిధులు సకాలంలో విడుదల చేయాలి. అప్పుడే గ్రామాలు బలపడతాయి. ఎన్నికలకు ముందే ఈ పనులు పూర్తి చేసేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి.