తెలంగాణలో ఏ పార్టీ చూసినా అంతర్గత కుమ్ములాటలే. దాని పర్యవసానంగా రాష్ట్రంలో రాజకీయ అగాథం ఏర్పడిరది. రాష్ట్ర ప్రజానీకం ఏ పార్టీనీ నమ్మలేని స్థితిలో ఉన్నారు. ప్రజల సమస్యలు వినే నాయకుడు లేడు.
ప్రతీకాత్మక చిత్రం
ఒకరిది ఉనికి కోసం తండ్లాట..
ఒకరిది అధికారం కోసం తొండాట..
ఒకరిది అహంకారపు తిట్లాట..
ఒకరిది ఆధిపత్యపు కొట్లాట..
ఇప్పుడున్న పార్టీలవన్నీ అదే పాట..
ప్రజలకిక కావాలి కొత్త బాట..
ఆర్తనాదాలు కొత్త అండ కోసం..
జన నినాదాలు కొత్త జెండా కోసం..
రావాలి.. ప్రజల కోసం మరో పార్టీ!
ఇప్పుడున్న పార్టీలపై తప్పదు పోటీ!!
ఒకడు సవాల్ అంటాడు.. ఇంకొకడు ప్రతి సవాల్ విసురుతాడు. ఒకడు డేటు, ప్లేస్ ఫిక్స్ చెయ్యుమని బీరాలు పలుకుతాడు.. ఇంకొకడు పబ్బులు, క్లబ్బులు అంటూ నోటికొచ్చింది మాట్లాడుతాడు. రప్పా రప్పా రంకెలు.. అర్థం కాని బొంకులు. పనికిరాని పథకాలు.. ప్రతిఫలం అనుభవించాలి భవిష్యత్ తరాలు. ఒక విజన్ లేదు.. విమర్శలు తప్ప. ఒక అర్థవంతపు చర్చ లేదు.. ఆరోపణలు తప్ప. అలాంటి శూన్యమే నేడు తెలంగాణలో.. కొత్త పార్టీకి కావాల్సినంత జాగా. కొత్త పార్టీకి పలుకుతోంది తెలంగాణ స్వాగతం.. కోరుతోంది సామాజిక న్యాయం.
తెలంగాణలో ఏ పార్టీ చూసినా అంతర్గత కుమ్ములాటలే. దాని పర్యవసానంగా రాష్ట్రంలో రాజకీయ అగాథం ఏర్పడిరది. రాష్ట్ర ప్రజానీకం ఏ పార్టీనీ నమ్మలేని స్థితిలో ఉన్నారు. ప్రజల సమస్యలు వినే నాయకుడు లేడు. ఉన్న నాయకులు అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. వాళ్ల లొల్లి చూసి.. మన లొల్లేం పట్టించుకుంటాడులే అని ప్రజలు కూడా సమస్యలు చెప్పుకోవడం మానేశారు. ఒకప్పుడు ఒక ప్రజావ్యతిరేక నిర్ణయం తీసుకుంటే పార్టీలన్నీ కలిసి ప్రభుత్వంపై పోరాడేవి. అంతా ఏకమై పిడికిలి బిగించేవారు. కానీ.. నేడు సొంత పార్టీలోనే కాలు గుంజే ప్రబుద్ధులు ఉండటంతో ప్రతి నాయకుడిది అస్థిత్వపు ఆరాటమే అయిపోయింది.
తెలంగాణ నాడీని పట్టి పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. విజయవంతంగా ఉద్యమాన్ని సాగించి స్వరాష్ట్రాన్ని సాధించింది. పదేళ్లు అధికారాన్ని అనుభవించింది. నేడు ప్రతిపక్షంలో చేరిన ఆ పార్టీ.. నేడు మాత్రం ప్రజల నాడీని పట్టలేకపోతోంది. ప్రజల సమస్యలపై పిడికిలి ఎత్తడం లేదు. ప్రెస్ నోట్లు.. ప్రెస్ మీట్లు.. ప్రాసల ట్వీట్లు.. తప్ప ఆ పార్టీ పొడిచిందేమీ లేదు. ప్రజల కోసం పోరాటం చేసిందేమీ లేదు. 18 నెలల పాలన కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఒడిసి పట్టలేకపోతోంది. అవసరం ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తి, అవసరం లేనప్పుడు అంతే గప్‌చుప్‌గా ఉండటం కేసీఆర్ స్టైల్. ఆ స్టైల్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు నడిచింది. కానీ, ఫక్తు రాజకీయ పార్టీగా మారినా అదే స్టైల్ కొనసాగిస్తానంటే కుదరదు. జనరేషన్ మారింది. జనం మారారు. అప్పటికి అంతే.. ఇప్పటికి ఇంతే అనే బాపతు. ఆ పాత స్టైల్ ఇప్పుడు అవుట్ డేటెడ్. ఆ విషయం రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ని చూసిన తర్వాతైనా కేసీఆర్‌కు అర్థమై ఉండాలి. నిత్యం ఏదో ఒక వార్తతో ప్రజల్లో ఉండటం వల్లే వాళ్లకు నేడు దక్కిన అధికారం అనడంలో ఏ సంశయమూ లేదు. ప్రజల్లో తిరిగితేనే, ప్రజలను ఆదుకుంటేనే ఏదైనా దక్కేది. నిక్కచ్చిగా చెప్పాలంటే ప్రజలను అడుక్కుంటేనే అధికారం, అందలం. కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీఆర్‌ఎస్ అనుకోవడం భ్రమే అవుతుంది. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం వెతికే క్రమంలో బీఆర్‌ఎస్ లాస్ట్ ప్లేస్‌లోనే ఉంటుంది. దానికి కారణం బీఆర్‌ఎస్సే. ఓడిపోతే పోయి ఇంట్లో పడుకుంటా.. కాళేశ్వరంలో చిన్న పిల్లర్ కూలిపోతే ఇంత రాద్ధాంతమా.. వ్యాఖ్యలు ప్రజల అహాన్ని దెబ్బతీశాయి. ఆ వ్యాఖ్యలు ఇంకా ప్రజల చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డికి కాస్తో కూస్తో అదే ప్లస్. అందుకే కేసీఆర్‌ను ఎంత తిట్టినా ప్రజలు ఇంకా సైలెంట్‌గానే ఉంటున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత, ఓ ఇద్దరు పెద్ద స్థాయి నేతలు తప్ప ఇంకెవరు మీడియాతో మాట్లాడినా ప్రజలు పట్టించుకోవడం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణలోపమే దీనికి కారణం. దాన్ని సరిదిద్దుతామని కేటీఆర్ ప్రకటించి 18 నెలలు గడిచినా, ఇప్పటికీ ఇంచు కూడా ముందుకు కదల్లేదు. కదిలే చాన్స్ కూడా లేదేమో. కుటుంబంలో ఆధిపత్య పోరు ఉంటే బయటి సమస్యలు తీర్చడం కష్టమే అవుతుంది.
బీజేపీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్న పార్టీ అది. బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్ ఉండగా, కిషన్ రెడ్డిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు. ఆ ఫలితం ఏంటో అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసిపోయింది. కర్ణాటకలో డీకే శివకుమార్, ఏపీలో పవన్ కల్యాణ్, తెలంగాణలో రేవంత్ రెడ్డి.. వీళ్లంతా ఫైర్ బ్రాండ్లే. వాళ్లే ఆయా పార్టీలకు అధికారాన్ని తెచ్చిపెట్టారు. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానే కొనసాగి ఉంటే తెలంగాణలో బీజేపీ మరో స్థాయిలో ఉండేది. సరే.. ఇప్పటికైనా, పద్ధతి మార్చుకొని మళ్లీ గాడిలో పడిరదా? అంటే అదీ లేదు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక బ్లండర్ మిస్టేక్. పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకుడు కాబట్టి రామచంద్రారావుకు బాధ్యతలు ఇవ్వడం కరెక్టే అని ఆ పార్టీవాళ్లు భావించి ఉండొచ్చు. కానీ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రభావం పార్టీలకు అతీతంగా ప్రజలపై పడుతుంది. ఆ నాయకుడు ఎలాంటి వాడు? సమస్యలను ఎలా అర్థం చేసుకోగలడు? ప్రభుత్వంపై ఏ స్థాయిలో పోరాడతాడు? అన్న కోణాల్లో ప్రజలు ఆలోచిస్తారు. హైదరాబాద్ వరకు రాంచందర్ రావు అంటే తెలుసు. కానీ, తెలంగాణ మారుమూల వరకు పార్టీని తీసుకెళ్లే సత్తా ఆయనకు లేదు. పైగా, అగ్ర కుల నాయకుడు అన్న ముద్ర వల్ల బీజేపీ నుంచి ప్రజలు దూరం జరగడం మనం చూడబోతున్నాం. ఆరెస్సెస్‌లో పెద్ద స్థాయిలో ఉండేవాళ్లంతా ఆ వర్గంవాళ్లే. వాళ్ల సిఫార్సు వల్లే రాంచందర్ రావుకు ఆ పదవి దక్కి ఉండొచ్చు. రాజాసింగ్ లాంటి నాయకుడిని దూరం చేసుకోవడం పార్టీకే కాదు.. హిందూత్వ భావజాలం కలిగిన అనేక మందికి మింగుడు పడటం లేదు. కాబట్టి అధికారం కట్టబెట్టే స్థాయిలో బీజేపీని ప్రజలు ఆదరిస్తారనుకోవడం శుద్ధ దండగ.
ఇక, అధికారంలో ఉన్న కాంగ్రెస్ గురించి కాస్త ఎక్కువే చెప్పుకోవాలి. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇక్కడ ప్రజాస్వామ్యం అనే పదం వాడేకంటే ఎవరికి వారే తోపు అన్న పదం వాడటం బెటర్. అధికారంలోకి వచ్చిందన్న సంబురమే గానీ, ఏ నాయకుడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. తమ శాఖలపై ఆయా మంత్రులకు పట్టు లేదు. ప్రెస్ మీట్లు పెట్టడం.. కేసీఆర్‌ను తిట్టడంతోనే కాలం వెల్లదదీస్తున్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కిందిస్థాయి నేతల వరకు అంతా బూతులను కంఠస్థం చేస్తున్నారు. ప్రతిపక్షాలను తిట్టాలంటే ఆ బూతు పదాలనే వాడుతూ తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. హామీల అమలు చేయాలన్న సోయి లేదు.. ప్రజల గుండెల్లో పది కాలాల పాటు నిలిచిపోవాలన్న కోరిక లేదు.. మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆశ అంత కన్నా లేదు.. ఉన్న ఐదేళ్లలోనే ఏ టైం ఎలా ఉంటుందో తెలియక.. దోచుకోవడం, దాచుకోవడంపైనే ఫోకస్ పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని రిపోర్టు ఇస్తే.. ఐదేళ్లైతే అధికారంలో ఉంటాం కదా! అనే నాయకుడు ఉన్నాడంటే ప్రజల సమస్యలను వాళ్లు ఎంతలా పట్టించుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. సీఎంకు హెలికాప్టర్ ఉంటే, తమకు ఎందుకు హెలికాప్టర్ లేదు.. తమకూ హెలికాప్టర్ కావాల్సిందేనని మారాం చేసే సంకుచిత స్వభావం ఉన్న నేతలున్నారు ఆ పార్టీలో. ఇప్పటికిప్పుడు ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు వచ్చిన ఢోకా ఏమీ ఉండకపోవచ్చు. కానీ, మరో పదేళ్లు కాంగ్రెస్ పేరు ఎత్తాలంటేనే ప్రజలు అసహ్యించుకునేలా పరిస్థితి తయారవుతోంది. చివరగా, వామపక్షాలు ఉనికినే కోల్పోయాయి. కారణం.. వామపక్ష పెద్దోళ్ల వాదం కమ్యూనిజం. వాళ్ల పిల్లలు క్యాపిటలిజం. కార్యకర్తలు కష్టాలయిజం.
వస్తే.. బీసీ పార్టీదే అధికారం
తెలంగాణలో ఎన్నడూలేని విధంగా బీసీ వాదం బలపడుతోంది. పార్టీలకు అతీతంగా బీసీలంతా ఏకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాళ్లంతా ఒక పార్టీ పెట్టి రంగంలోకి దిగితే.. తిరుగుండదు. దాన్ని అందరికంటే ముందుగా పసిగట్టింది కేసీఆర్. ఓటమి తర్వాత కేసీఆర్ ఎత్తుకున్న తొలివాదం బీసీ వాదం. బీసీ వాదం బలపడుతోందని గ్రహించిన మాజీ సీఎం.. గత ఏడాది సెప్టెంబర్‌లో మాజీ స్పీకర్ మధుసూదనాచారి నేతృత్వంలో 40 మంది బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందాన్ని తమిళనాడుకు పంపించారు. ఆ రాష్ట్రంలో బీసీలదే పెద్ద పీట. బీసీలు అధికారం సాధించడంలో ఎలా సఫలీకృతులు అయ్యారు? అని తెలుసుకొనేందుకు ఆ బృందం అక్కడికి వెళ్లి, తిరిగివచ్చి ఓ నివేదికను కేసీఆర్ చేతిలో పెట్టింది. ఆ నివేదిక ఆధారంగానే ప్రస్తుతం కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. బీసీవాదాన్ని బీసీల కంటే ముందే కబ్జా చేసేందుకు కవితకు దిశానిర్దేశం చేశారా? ఆ దిశగానే కవిత బీసీవాదాన్ని బలంగా వినిపిస్తున్నారా? అంటే.. కేసీఆర్ స్ట్రాటజీ తెలిసినవాళ్లకు అవుననే అనిపిస్తుంది. తానే స్వయంగా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నా, కేటీఆర్‌తో మాట్లాడిరచినా, పార్టీ నినాదంగా మలచినా బూమరాంగ్ అవుతుంది. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఎందుకు చేయలేదు? అని కాంగ్రెస్, బీజేపీ చీల్చిచెండాడుతాయి. బీసీ నాయకుడు ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి వెళ్లగొట్టింది నిజం కాదా? ఎస్సీని సీఎం చేస్తానని మోసం చేసి, ఇప్పుడు బీసీలను కూడా మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఎండగడుతాయి. కాబట్టి.. జైలుకు వెళ్లొచ్చిన కవిత, పైగా మహిళ కాబట్టి ఆమే సరైన అస్త్రం అని భావించి కేసీఆర్ ఈ ఎత్తుగడ వేస్తున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కవిత మహిళ కాబట్టి విపక్షాలు ఎక్కువ మాట్లాడితే వారిపై వీరతాండవం చేసేందుకూ అవకాశం కుదురుతుందనేదే కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. అటు రేవంత్ రెడ్డి తన సామాజిక వర్గానికే ప్రభుత్వంలో పెద్దపీట వేయడం, ఇటు.. బీజేపీ కూడా అగ్రకులానికే పెత్తనం కట్టబెట్టడం, బీఆర్‌ఎస్ సైలెంట్‌గా ఉండటం చూస్తుంటే.. తెలంగాణలో మరో పార్టీ పురుడు పోసుకోవాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, తెలంగాణ ఉద్యమకారుడు వీ ప్రకాశ్ లాంటి ఇంటెలెక్చువల్స్ బీసీలను సంఘటితం చేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నారు. తీన్మార్ మల్లన్నలాంటి యువ నాయకులను ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీలంతా బీసీ నాయకులకు ఆర్థికంగా, రాజకీయంగా మద్దతు ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో బీసీ రాజ్యాధికారం రావడం పక్కా.
- శ్రావణ్ కుమార్ బొమ్మకంటి, ఎడిటర్
9581291919