ప్రభుత్వాలకు అమాయకులను బలి చేయడం అలవాటేనా.. పదో తరగతి విద్యార్థి హరీశ్‌కు హైకోర్టు ఊరట..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||తెలంగాణ హైకోర్టు Photo: twitter||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తప్పు చేసింది ఒకడు.. కానీ శిక్ష వేసింది మరొకరికి. ఇది అమాయకులను బలి చేయడం అనాదిగా వస్తున్న తీరు. అలాంటి ఘటనే పదో తరగతి లీకేజీ వ్యవహారంలో జరిగింది. వాడెవడో గోడ దూకి స్కూల్‌లోకి వస్తుంటే చూడని భద్రత సిబ్బందిది తప్పు.. వచ్చి విద్యార్థిని బెదిరిస్తుంటే పట్టించుకోకుండా వ్యవహరించిన ఇన్విజిలేటర్‌ది తప్పు.. పరీక్ష కేంద్రం ఇన్‌చార్జిది తప్పు.. మొత్తంగా పేపర్ లీకేజీలో ప్రభుత్వానిది, మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిది తప్పు.. కానీ, దొరికిందే తడవుగా విద్యార్థిపై ప్రతాపం చూపించారు అధికారులు. ఏకంగా ఐదేళ్ల పాటు డిబార్ చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి ఆదేశం కచ్చితంగా ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు. అయితే, ఎట్టకేలకు సదరు విద్యార్థికి న్యాయమే జరిగింది. వివరాల్లోకెళితే.. కమలాపూర్ జడ్పీ బాలుర పాఠశాల నుంచి హిందీ పేపర్ లీక్ అయిన ఘటనలో.. విద్యార్థి హరీశ్‌ను ఐదేళ్ల పాటు డిబార్ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు.

గురువారం పరీక్ష రాయటానికి వచ్చిన ఆ విద్యార్థిని.. హన్మకొండ హీఈవో పిలిచి.. నీ ప్రశ్నపత్రం వల్ల ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారని తన దురుసుతనం ప్రదర్శించారు. పరీక్షకు అనుమతించేది లేదంటూ బయటికి పంపించేశారు. హాల్ టికెట్ తీసుకొని ఓ పేపర్‌పై సంతకం కూడా తీసుకున్నారని ఆ విద్యార్థి తెలిపాడు. అయితే, తనకు న్యాయం జరుగుతుందని నమ్మిన ఆ విద్యార్థి హైకోర్టు మెట్లు ఎక్కాడు. హరీశ్ తండ్రి హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు.

గోడ దూకి పరీక్ష కేంద్రంలోకి వచ్చిన నిందితుడు శివ కృష్ణ.. పరీక్ష రాస్తున్న హరీశ్‌ను బెదిరించి ప్రశ్నపత్రం లాక్కున్నాడని అందులో పేర్కొన్నాడు. భయపడి ప్రశ్నపత్రం ఇచ్చాడే తప్ప, తన తప్పు లేదని వివరించాడు. దీనిపై వాదనలు విన్న కోర్టు.. సోమవారం నుంచి హరీశ్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. గురువారం నాటి పరీక్ష రాయలేకపోయిన ఆ విద్యార్థి ఎట్టకేలకు.. కోర్టు ఆదేశాలతో సోమవారం నుంచి పరీక్షలకు హాజరు కానున్నాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్