కేటీఆర్ తిడుతున్నది రేవంత్ రెడ్డినా.. ఓట్లేసిన తెలంగాణ ప్రజలనా..?

బీఆర్ఎస్ నేతలకు కాస్త టెక్కు ఎక్కువైంది.. ఒకసారి దించితే అంతా సెట్ అవుతుంది.. మార్పు కోరుకుందాం.. అన్న ఉద్దేశమే ప్రతి ఒక్క తెలంగాణవాదిలో. ఆ ‘మార్పు’ అన్న అస్త్రాన్నే కాంగ్రెస్ ఒడిసిపట్టింది.

KTR

కేటీఆర్

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది..? అభివృద్ధి చేయనందుకా..? ఉద్యోగాలు ఇవ్వనందుకా..? ఉద్యోగ అవకాశాలు కల్పించనందుకా..? ప్రజల సమస్యలు పట్టనందుకా..? సంక్షేమ పథకాలు అమలు చేయనందుకా..? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి బీఆర్ఎస్ ఓటమికి సమాధానం కాదు. బీఆర్ఎస్ నేతలకు కాస్త టెక్కు ఎక్కువైంది.. ఒకసారి దించితే అంతా సెట్ అవుతుంది.. మార్పు కోరుకుందాం.. అన్న ఉద్దేశమే ప్రతి ఒక్క తెలంగాణవాదిలో. ఆ ‘మార్పు’ అన్న అస్త్రాన్నే కాంగ్రెస్ ఒడిసిపట్టింది. ఆ పార్టీ కూడా ఏదో పొడిచేస్తాం.. అవినీతిని అంతం చేస్తాం.. ప్రపంచ నగరాలను సృష్టిస్తాం.. అని చెప్తే ప్రజలు నమ్మలేదు. ప్రజలు కోరకున్నది మార్పు.. ఆ మార్పు కోసం తమకు ఓటెయ్యండి అని అడిగింది. ఆ స్లోగన్‌కు ప్రజలు కనెక్ట్ అయ్యారు. వాస్తవానికి తెలంగాణలో నల్లి బొక్క దగ్గర, మటన్ ముక్క దగ్గరే పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. దీనికే గొడవా..? ఎందుకు? అంటే ఆత్మగౌరవం. కారణం చిన్నదే కావచ్చు. కానీ.. ఆత్మగౌరవం తగ్గితే ఇక్కడి ప్రజలు ఏ మాత్రం తట్టుకోరు.

ఆ విషయం బీఆర్ఎస్ అధినేత దగ్గరి నుంచి కిందిస్థాయి కార్యకర్త (వీళ్ల తెలంగాణ వాళ్లే కదా) వరకు అందరికీ తెలుసు. మరి ఆ విషయాన్ని గులాబీ దళం ఎందుకు మరిచిందో. గులాబీ బాస్, చిన్న బాస్ ఎందుకు  కానీ.. తెలంగాణ ప్రజలు తమపై పెత్తనాన్ని కొంత వరకే సహిస్తారు. శ్రుతిమించితే ఒక ఉద్యమమే వచ్చింది. అలాంటిది ఓ పార్టీని గద్దె దించడం ఓ లెక్కా..! అందుకే ‘మార్పు’ అని చెప్పిన పార్టీకి ఓటేశారు. మార్పు అని ఓటేసినందుకు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని కొంత వాస్తవమే. ‘పల్లెల్లోనూ ఎకరానికి రూ.20 లక్షలకు తగ్గని భూమి రేటు.. అమాంతం పడిపోయింది. ఏ పథకమూ సరిగా అమలు కావడం లేదు. ఏ నాయకుడూ తమ సమస్యలను పట్టించుకోవడం లేదు’ అని నిట్టూరుస్తున్నారు. పైగా, కొందరు హస్తం పార్టీ నాయకుల మాటలు అసహ్యించుకునేలా ఉంటున్నాయన్నదీ వాస్తవమే.

ఏడాది కూడా గడవకుండానే ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందన్నదీ నిజమే. కానీ.. ఆ అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు విఫలం అవుతున్నారన్నది కూడా వాస్తవం. ఎందుకంటే.. మార్పు కోసం ఓటేసింది ప్రజలు. ఆ ప్రజలనే కేటీఆర్ తిడుతున్నారన్నది ఇక్కడ అసలైన సమస్య. ‘‘మార్పు అన్నారుగా, మార్పు అంటే గిట్లనే ఉంటది, మార్పు వచ్చింది బాగుందా’’ వంటి వ్యాఖ్యలు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. అసలే కాంగ్రెస్ పాలన బాగోలేదని తాము బాధపడుతుంటే.. పొడుసుట్ల మాటలతో కేటీఆర్ తమ మనసులను మరింత గాయపరుస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఒక వ్యక్తి మరో వ్యక్తిని కొడితే.. కొట్టినందుకు అంతగా బాధపడడు. కానీ పక్కనున్నవాళ్లు నవ్వితే ఎక్కడలేని కోపంతో రగిలిపోతాడు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు-కేటీఆర్ మధ్య జరుగుతున్నదీ అదే. కొడుతున్నది కాంగ్రెస్ అయితే, బాధపడేది ప్రజలు. కానీ.. నవ్వే పాత్ర కేటీఆర్‌ది అని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు.

కేటీఆర్ చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలే బీఆర్ఎస్‌కు ప్రజలను ఇంకా దగ్గర చేయడం లేదన్నది ఒక వర్గం రాజకీయ పండితుల వాదన. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులకు ఇప్పటికే తెలంగాణ ప్రజలు కారు వైపు మళ్లాల్సింది. కానీ.. అహంకారం-ఆత్మాభిమానం మధ్య కొట్టుమిట్టాడుతున్నందునే ఆ వైపు వెళ్లడం లేదని విశ్లేషిస్తున్నారు. ఒక దెబ్బ కొట్టినా పెద్దగా పట్టించుకోని జనాలు.. తిడితే మాత్రం తట్టుకోరు. అది గుర్తెరిగితే గులాబీ గుబాలించడం ఖాయం. అలా వద్దు.. మేం ఇలాగే ఉంటాం.. మీరు అలాగే ఉండండి.. మార్పు మంచిగుందా లాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగానే ఉంటారు తప్ప ఆత్మాభిమానాన్ని వదులుకోరు.

చివరగా, సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య తిట్ల వార్ కామనే. గత కొన్నేళ్లుగా మనం చూస్తున్నదే. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిందదే.. ఇప్పుడు చేస్తున్నదీ అదే. ఆయన తీరే అలా. కేసీఆర్, కేటీఆర్‌ను దాటి బయటివారిని రేవంత్ సాధారణంగా అనరు. ఆ క్లారిటీ ఆయనకు ఉంది. కానీ, కేటీఆరే ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవాల్సింది. రేవంత్‌ను దూషించే క్రమంలో తెలంగాణ ప్రజలను కేటీఆర్ తిడుతున్నారన్నదే ఆశ్చర్యంగా ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ తప్పు చేసినా, మార్పు అంటే ఇలానే ఉంటుంది అనే వ్యాఖ్యలు రేవంత్‌ను కాదు.. తెలంగాణ ప్రజలను తిడుతున్నట్టేనని చెప్తున్నారు. రాజకీయాల్లో పద్మవ్యూహాన్ని ఛేదించిన ఘనుడు.. కేసీఆర్ (అర్జునుడిలా). పద్మవ్యూహంలో ఇరుక్కున్నది.. కేటీఆర్(అభిమన్యుడిలా). ఇప్పుడు ఆ పద్మవ్యూహాన్ని (కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ చదరంగం) అర్థం చేసుకొని, ప్రజలు కోరుకునేలా వ్యవహరించినప్పుడే కేటీఆర్ మరో అర్జునుడు అవుతారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్