Opinion | బీబీసీ.. హిండెన్‌బర్గ్.. ప్రధాని మోదీపై పాశ్చాత్య దాడి.. ఎన్నికలే టార్గెట్‌గా అడుగులు?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Photo: PIB||

(వ్యాసకర్త : పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు)

ఈవార్తలు, ఈముచ్చట: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ పేరు వింటే సగటు భారతీయుడికి ఒక ధైర్యం. గల్ఫ్ దేశాల్లో ఉండేవారికి ఒక ఐడెంటిటీ. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉండేవారికి ఒక గౌరవం. పాకిస్థాన్, చైనా వంటి దేశాలకు భయం. విశ్వగురువుగా భారతదేశాన్ని నిలిపే సంకల్పంతో దేశ అత్యున్నత బాధ్యతలు చేపట్టిన ఆయన.. దిగ్విజయంగా పాలనను కొనసాగిస్తున్నారు. ప్రపంచానికి యోగా స్వరూపాన్ని పరిచయం చేశారు. విశ్వవేదికపై భారత్‌కు ప్రత్యేక స్థానాన్ని సాధించిపెట్టారు. ఎంతలా అంటే.. ప్రధాని నరేంద్ర మోదీ తలచుకొంటే ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపగలరు అనేంత. కానీ, ఆయన వేరే దేశాల సార్వభౌమత్వంపై పెత్తనం చెలాయించుకోవడం లేదు. వారి మనోభావాలను టచ్ చేయలేదు. ప్రస్తుత రోజులు యుద్ధం చేసే రోజులు కావని రష్యాకు హితవు చెప్తూ శాంతి మంత్రం బోధిస్తున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఇదే. పరిస్థితులను బట్టి అడుగులు వేయాలన్నదే ఆయన సిద్ధాంతం.

ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో నా మాదిరి లేబర్ పని చేసుకొని బతికే ఎంతో మందికి ప్రధాని మోదీ ఒక ఐడెంటిటీ. నాతో పాటు వేర్వేరు దేశాలకు చెందిన ఎంతోమంది కార్మికులు పనిచేస్తున్నారు. నా దేశం భారతదేశం అని చెప్పగానే.. నరేంద్ర మోదీ కా ఘర్ హై! అని వారు అంటుంటే నాలో తెలియని ఉద్వేగం. ఒకప్పుడు భారత్ అంటే చులకనగా చూసినవారు ఉన్నారు. కానిప్పుడు అలా కాదు. ఎక్కడికి వెళ్లినా మోదీ అన్న పదం వినిపిస్తోంది. నా వరకు ఆత్మాభిమానమే అన్నింటికన్నా గొప్పది. అది నాకు మోదీ వల్లే దొరుకుతోంది.

ఇప్పుడిప్పుడే కొన్ని సంఘటనలు దీర్ఘాలోచనలను రేకెత్తిస్తున్నాయి. అవేంటంటే.. ఒక్కసారిగా పాశ్చాత్య మీడియా, సర్వే సంస్థలు దేశంపై, దేశంలోని మనుషులపై ఎగబడడం ఆందోళన కలిగిస్తోంది. ఉదాహరణకు బీబీసీ. ఇన్నేళ్లు కుక్కిన పేనులా పడి ఉన్న ఈ సంస్థ.. ఒక్కసారిగా మోదీపై దండయాత్ర మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా మోదీ ప్రభ పెరగడం ఇష్టం లేని కొందరు ఈ సంస్థ ద్వారా మోదీ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత అవినీతిమయమైన మీడియా సంస్థ ఏదైనా ఉందీ అంటే.. మొదటగా వినిపించే పేరు బీబీసీనే. అందులో వాస్తవం ఎంత ఉందన్నది ప్రపంచానికి అంతా తెలుసు.

మోదీ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నంలో ఇంకో ఎత్తుగడ హిండెన్‌బర్గ్. ఈ సంస్థ అదానీ సంస్థ ఎదిగిన క్రమం అంతా ఫేక్ అని చెప్పింది. ఎంత రిసెర్చ్ చేసిందో, ఏమో గానీ.. మార్కెట్‌లో అదానీ షేర్లను పాతాళంలోకి నెట్టేలా కుట్ర పన్నింది. నిజమే.. అదానీకి, మోదీకి ఏం సంబంధం అని కొందరికి ప్రశ్న తలెత్తవచ్చు. ఇక్కడ ఒక విషయం నర్మగర్భంగా చెప్పుకోవాలి. అందేంటంటే.. కొన్ని కార్పొరేట్ సంస్థలు తమకు నచ్చిన పార్టీకి విరాళాలు ఇస్తుంటాయి. గతంలో అనేక కార్పొరేట్ కంపెనీలు కాంగ్రెస్‌కు, అమెరికాలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చినవే. అందులోభాగంగానే అదానీ కంపెనీ బీజేపీకి అనుకూలంగా ఉండిఉండొచ్చు. అనుకూలంగా ఉన్నంతమాత్రాన మోదీపై ఎక్కుపెడితే ఎలా? మోదీనే చేయించాడని అంటే ఎలా? ఆ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా?

సరే అదీ పోనీ.. ఇప్పుడు బిలియనీర్ జార్జ్ సోరస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతగాడు.. విదేశీ ఇన్వెస్టర్లకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మోదీకి చెప్పి పెట్టారా? పైగా, అదానీ సంక్షోభం మోదీని బలహీనపరుస్తుందని మానసికంగా మోదీని దెబ్బతీసే కుట్రలకు తెర తీశారు. ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టడం వారి సొంత ఇష్టం, వారి సొంత నిర్ణయం. కానీ, మోదీకి చెప్పి, మోదీ అనుమతి తీసుకొని ఇదంతా చేశారా? అంటే కాదు. అలాంటప్పుడు మోదీ ఎందుకు సమాధానం చెప్పాలి? ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీపై పాశ్చాత్య మీడియా కక్ష కట్టిందనే చెప్పాలి. భారతీయులకు ఆత్మాభిమానం ఎక్కువ. ఒక పూట తినకుండా ఉండేందుకైనా సిద్ధమే. కానీ, ప్రధాని మోదీని, భారత దేశ ఔన్నత్యాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే ఏ దేశానికైనా, ఏ సంస్థకైనా ఇబ్బందులు తప్పవు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్