నెహ్రూ ఈ తొలి పోకడ వామపక్షవాదులకు, హేతువాదులకు, సెక్యులరిస్టులకు, సోకాల్డ్ మేధావులకు హిందూ ధర్మం పైనా, హిందూ గ్రంథాలపైనా విశృంఖలంగా దాడులు చేయడానికి అవకాశాలు కల్పించింది.
శ్రీరాముడు, అశోకుడు
ఓవైపు..
రాముడిని పూజించే భారతీయులు
రామకోటి రాసే రామయ్య భక్తులు
మరోవైపు..
రామాయణాన్ని అభాసుపాలు చేసే శక్తులు
రాముడిని నిందించే స్వయం ప్రకటిత మేధావులు
ఇలా..
కొందరు రామ నామ జపం చేసేవారుంటే..
మరికొందరు ఆ పురుషోత్తముడిని నిందించేవారున్నారు..
ప్రధాని మోదీ దగ్గరి నుంచి అసదుద్దీన్ ఒవైసీ దాకా.. కమ్యూనిస్టుల దగ్గరి నుంచి కుహానా మేధావుల దాకా.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. ద్వారక నుంచి కామాఖ్య దాకా.. రామాయణం గురించి మాట్లాడేవారే. రాముడి జపం చేసేవారే. మరి రాముడిపైనే ఎందుకు ఆ స్థాయిలో దాడి జరుగుతున్నది? రామాయణ విధ్వంసాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? భారతీయ సనాతనంలో ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు, ప్రబంధాలు, భారత, భాగవతాలు ఉన్నా.. ఒక్క రాముడిపైనే, రామాయణంపైనే దాడి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు? అదే సమయంలో రాముడిపై భక్తి అంతకంతకూ పెరుగుతోంది. 200 ఏళ్లు భారత దేశాన్ని పాలించిన బ్రిటిష్ పాలకులు భారతదేశ ధర్మాన్ని, ఇక్కడి సంస్కృతిని నాశనం చేయాలనుకున్నారు. వాళ్ల వల్ల కాలేదు. కానీ.. వాళ్ల వారసులుగా నెహ్రూ బృందం ఈ విధ్వంస రచనను అతి తెలివితో ముందుకు తీసుకెళ్లింది. రామాయణం పుక్కిటి కథ అని ప్రచారం చేయాలి.. రాముడి వ్యక్తిత్వాన్ని హననం చేయాలి.. వీలైతే రామాయణం భారతదేశంలో పుట్టిందే కాదని చెప్పాలి.. ఇవే వారి టార్గెట్లు. సీత మహిళ కాబట్టి ఆమెను తాకే సాహసం చేయలేదు. కానీ, రాముడి చరిత్రను మసకబార్చేందుకు వీలైనంత శక్తిని కూడగట్టుకొని విశ్వ ప్రయత్నాలు చేశారు.. చేస్తూనే ఉన్నారు. నమ్మకాలను మూఢనమ్మకాలుగా ప్రచారం చేయాలని, మహర్షులు చెప్పిన అంశాలను హేతుబద్ధం కాదని, అసలు భారతదేశంలో నాగరికతే లేదని నమ్మించేలా కుట్రలు చేశారు. మొగలులు, బ్రిటిష్ వాళ్లు కూడా చేయని కుట్రకు తొలి భారత ప్రభుత్వం నాంది పలికింది.
అది 1947 జూలై 22.. భారతదేశం స్వతంత్రం కావడానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్నది. స్వాతంత్య్రానికి సంబంధించిన మార్గదర్శకాలు, ఇతరేతర అంశాలపై దేశంలోని అత్యున్నత రాజకీయ నేతలు రోజువారీగా చర్చలు జరుపుతున్న సందర్భం అది. జూలై 22న భారత త్రివర్ణ పతాకంలో నుంచి గాంధీ చరఖా మాయమైపోయింది. ఆ స్థానంలో బౌద్ధుల సింబల్ అయిన అశోకచక్రం వచ్చి చేరింది. అప్పటికే కాంగ్రెస్‌పై, జాతీయోద్యమంపై గాంధీ ఇన్‌ఫ్లుయెన్స్ తగ్గిపోయింది. నెహ్రూ డామినేషన్ సహజంగానే పెరిగిపోయింది. రాజకీయ వ్యవస్థపై పూర్తి పట్టు సాధించిన తర్వాత నెహ్రూ చాలా తెలివిగా వ్యవహరించారు. ఆయన ఆలోచన ఏమిటంటే మెజార్టీగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు కనిపించవద్దు. కానీ, హిందూ మూలాల విధ్వంసానికి పూనుకోవాలి. హిందూ ఐకాన్లను క్రమంగా తెరమరుగు చేయాలి. అలా అని ముస్లింలు, క్రైస్తవులను నెత్తిన పెట్టుకున్నట్లు ఎవరికీ అనిపించకూడదు, కనిపించకూడదు. అంతటి రాజనీతి ఆయనకు మాత్రమే సాధ్యపడిరది. ఎన్నికల ప్రసంగాల్లో, మైకుల తుప్పు వదలగొడుతూ, రామరాజ్యం తెస్తామంటూ పెద్ద పెట్టున బొబ్బలు పెట్టే నేతలకు భారతజాతి ఐకాన్‌గా రాముడిని, రామాయణాన్ని ఉంచాలన్న ఇంగితం లేకుండా పోయింది. దాన్ని ఒక మతపరమైన గ్రంథంగా చూశారు. మెల్లిగా రామాయణాన్ని పుక్కిటి పురాణంగా మార్చారు. రాముడిని ఒక మిథ్యగా చేశారు.
రామాయణాది ఇతిహాసాలను, ఇతర చరిత్రలను, చారిత్రక పురుషులను కనుమరుగు చేయడానికి నెహ్రూ అండ్ కో ముందున్న ఒకే ఒక అవకాశం.. బుద్ధుడు. బౌద్ధాన్ని ప్రమోట్ చేస్తే హిందువుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాదు. అసలు అనుమానమే రాదు. ఎందుకంటే బుద్ధుడిని దశావతారాల్లో ఒకడిగా హిందువులు కొలిచారు. కాబట్టి నెహ్రూ ఆయన గణాలు.. సింపుల్‌గా బౌద్ధాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించాయి. ఒక పథకం ప్రకారం బౌద్ధాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాయి. పనిలోపనిగా గాంధీ ఫిలాసఫీని కూడా ప్రజల మనసుల్లోంచి తుడిచేయడానికి పన్నాగం రచించారు. ఇందుకు నెహ్రూ వేసిన తొలి అడుగు త్రివర్ణ పతాకంలోనుంచి గాంధీ చరఖాను తొలగించడం. 1947 జూలై 22 న నెహ్రూ నాయకత్వంలో మహామహులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకొన్నారు. అప్పటికి ఇంకా గాంధీ జీవించే ఉన్నారు. చరఖా స్థానంలోకి ముందుగా చెప్పినట్టు అశోకుడి ధర్మచక్రం వచ్చి చేరింది. ఎవరైనా వ్యతిరేకిస్తారేమోనన్న అనుమానంతో బుద్ధుడి ప్రవచనాలను గాంధీ ప్రవచనాలతో పోల్చి చెప్పడం ప్రారంభించారు. బుద్ధుడు, గాంధీ ఇద్దరూ ఈ దేశానికి జాతిపితలు అని కూడా కొన్నాళ్లపాటు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ ఫిలాసఫీ భారత జాతీయ యవనికపై నుంచి తొలగిపోయింది. గ్రామ స్వరాజ్య సిద్ధాంతానికి తిలోదకాలిచ్చినట్టు ఈ చర్యతో స్పష్టమైన సంకేతాన్నే నెహ్రూ ఇచ్చారు. అప్పటిదాకా మర్యాదా పురుషోత్తముడిగా, ఆదర్శ పాలకుడిగా యావత్ భారత జాతి సమాఖ్య స్ఫూర్తికి ఏకతామూర్తిగా ఉన్న శ్రీరామచంద్రుడిని నెహ్రూ అండ్ కో కన్వీనియంట్‌గానే మరిచిపోయింది. కాదు.. కాదు.. కావాలనే పక్కన పెట్టారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నుంచి మహాత్మాగాంధీ వరకు జాతీయోద్యమ సారథులకు ప్రేరణగా నిలిచిన రామచంద్రుడు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఐకాన్ కాకుండా పోయాడు. భారతీయమైన ఫిలాసఫీకి మూలమైన రామాయణం ఈ పాలకులకు కనపడకుండాపోయింది.
జాతీయోద్యమానికి మంత్రంగా పనిచేసిన వందేమాతరం.. స్వతంత్ర దేశంలో దిక్కులేకుండా పోయింది. ఆ స్థానంలోకి జనగణమన వచ్చిచేరింది. జాతీయ జెండాలోకి ధర్మచక్రం వచ్చిన సరిగ్గా సంవత్సరం తర్వాత.. అదే అశోకుడి నాలుగు సింహాలు.. భారతదేశ అధికారిక రాజముద్రగా మారిపోయింది. జీవితమంతా రాజ్య విస్తరణ కాంక్షతో భయంకరమైన హింసకు పాల్పడి.. చివరికి శ్మశానంగా మారిన రణభూమిలో బౌద్ధం తీసుకున్న అశోకుడు ఏ విధంగా ఆదర్శప్రాయుడో అర్థం కాదు. చివరకు పిల్లల పాఠాల్లోకి కూడా ‘అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించెను’ అని బోధించడం మొదలు పెట్టారు. కానీ.. శ్రీరాముడు వీళ్లకు పనికిరాలేదు. అక్కడి నుంచి పద్ధతి ప్రకారం బౌద్ధ ధర్మాన్ని జనంలోకి ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. 1947 నుంచి 1956 వరకు బౌద్ధం నెహ్రూ నెత్తినెక్కి కూర్చున్నది. బహిరంగ ప్రదేశాలకు బౌద్ధ నామాలు వచ్చిచేరాయి. గౌతమ హాల్, లుంబినీ లేన్, కనిష్క హౌస్, బుద్ధ పార్క్.. ఇట్లా కోకొల్లలు. దేశంలో బౌద్ధ ధర్మానికి సంబంధించిన అన్ని ప్రదేశాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. బోయ్ గయ, శ్రావణి, సాంచి, లుంబిని, నలంద వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విద్యాసంస్థల స్థాపన, బౌద్ధారామాల పునర్జీవానికి అదేపనిగా పూనుకొన్నది. అంతేకాదు.. 46 వాల్యూమ్‌ల పాలి త్రిపీటక (బుద్ధుడి మాటలు) సంపూర్ణ సంపుటాన్ని దేవనాగరి లిపిలో ప్రచురించింది. 1956 నాటికి కేంద్ర సమాచార ప్రసారశాఖ బుద్ధుడిపై ఏకంగా పూర్తిస్థాయి సినిమాను నిర్మించింది. దీనికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డు కూడా వచ్చింది. 1954లో దేశవ్యాప్తంగా ఏడాదిపాటు బుద్ధ ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. సదస్సులు, ప్రదర్శనలు, సంబురాలు నిర్వహించారు. బుద్ధుడి 2,500 సంవత్సరాల జయంతి ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా నిర్వహించారు. నెహ్రూ విదేశాంగ విధానానికి బుద్ధిజం ఒక ఉపకరణంగా మారింది. ఈ దేశానికి బుద్ధిజం మాత్రమే అవసరమన్నంతగా ప్రభుత్వం దాన్ని ప్రమోట్ చేసింది.
నెహ్రూ పొలిటికల్ సక్సెస్.. బలంతో ఇతర నేతలు ఆయన వెంటే నడిచారు. బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, అంబేద్కర్ వంటివారు దేశమంతా తిరిగి బుద్ధిజాన్ని ప్రమోట్ చేశారు. దేశానికి మొదటి రాష్ట్రపతిగా వ్యవహరించిన రాజేంద్రప్రసాద్ వివాదాస్పద మహాబోధి టెంపుల్ చైర్మన్‌గా వ్యవహరించారు. రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ బుద్ధుడి బోధనలపై పుస్తకాలు రాశారు. స్వాతంత్య్రం వచ్చిన మూడేండ్ల తర్వాత ధమ్మపాద బౌద్ధ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేశారు. 1949లో కలకత్తాకు బుద్ధుడి శిష్యులైన సారిపుత్ర, మొగ్గల్లానల అస్థికలను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పెద్ద సభ జరిగింది. ఈ సభకు నెహ్రూ కూడా హాజరయ్యారు. ఈ సభకు హాజరైన బౌద్ధ సన్యాసులంతా పసుపు, ఎరుపు దుస్తులు ధరించారు. అస్థికల కలశాన్ని పట్టుకొని నెహ్రూ వేదికపైకి వస్తుంటే.. ఆయనపై పసుపు, గులాబీ రేకుల వర్షం కురిపించారు. నెహ్రూ కూడా పసుపు గులాబీ పువ్వును ఆ రోజు తన చొక్కాపై ధరించారు. ఆ రోజు అందరి ప్రసంగాలను ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారం చేసింది. దాదాపు దశాబ్దం పాటు రాజకీయంగా నెహ్రూ ఎదిగిన కొద్దీ.. ఆయనతోపాటే బౌద్ధం దేశమంతటా విస్తరిస్తూ పోయింది. తనకు మత విశ్వాసం లేదని మైకుల ముందు చెప్తూనే బౌద్ధమతం మాత్రం తనను చిన్నప్పటి నుంచే ప్రభావితం చేసిందని బయోగ్రఫీలో రాసుకొన్నారు. నెహ్రూ ఈ తొలి పోకడ వామపక్షవాదులకు, హేతువాదులకు, సెక్యులరిస్టులకు, సోకాల్డ్ మేధావులకు హిందూ ధర్మం పైనా, హిందూ గ్రంథాలపైనా విశృంఖలంగా దాడులు చేయడానికి అవకాశాలు కల్పించింది. ఇంకేం.. అప్పటినుంచి ఇప్పటివరకు అదే పనిగా పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా రాముడిపై, రామాయణంపై దాడులు తీవ్రమయ్యాయి. రాముడిని విలన్‌గా చేస్తే.. రామాయణాన్ని దుర్మార్గమైన గ్రంథంగా రుజువు చేయగలిగితే.. ఈ దేశాన్ని ఒక సంస్కృతిగా ముడివేసిన సూత్రం తెగిపోతుంది. అందుకే రాముడిని విలన్ చేయడం కోసం అశోకుడు హీరో అయ్యాడు.
రామాయణం చరిత్ర కాకపోయి ఉంటే.. కేవలం కావ్యమే అయితే.. రాముడు ఒక పాత్రే అయితే.. దానికి సార్వకాలీనత ఎలా సాధ్యపడిరది? అందుకే రామాయణం ఏమిటి? రాముడు ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు ఒక్కటే. రామాయణం అంటే భారతదేశం. భారతదేశం అంటే రామాయణం. రామాయణమంటే భారతీయ జీవన దృక్పథం. రామాయణమంటే మూర్తీభవించిన భారతీయ ధర్మం. రామాయణమంటే భారతీయుల మూలపురుషుడి చరిత్ర. రామాయణమంటే వేదం. రామాయణమే వేదం. వేదమే రామాయణం. 550 సంస్థానాలకు పైగా ముక్కలుగా ఉన్న దేశం. భిన్న నాగరికతలు, భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు, భిన్న మతాలు, భిన్న ఆచారాలు, భిన్న కులాలతో అత్యంత సంక్లిష్టమైన ఈ దేశాన్ని అంతర్లీనంగా%ౌ% ఏకసూత్రంతో ఏకత్రితం చేసింది రామాయణమే, సీతారాములే
- కోవెల సంతోష్ కుమార్,ప్రముఖ సీనియర్ జర్నలిస్టు