Punjab | దేశభక్తుల రాష్ట్రం ఉగ్రవాదుల అడ్డాగా మారుతోందా.. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||భగవంత్‌మాన్ సింగ్, ప్రధాని మోదీ||

ఈవార్తలు, నేషనల్ న్యూస్: భారత ఆర్మీ అంటే వెంటనే గుర్తొచ్చేవారు.. సిక్కులు. జవాన్లుగా వారి సేవలు చిరస్మరనీయం. అసలైన దేశభక్తికి పర్యాయపదం ఎవరు అంటే పంజాబీలు, సిక్కులు అనే మాటే వినిపిస్తుంది. నెత్తికి తలపాగా వారి రాజసానికి గుర్తుగా నిలుస్తుంది. సైన్యంలో వారిని చూస్తేనే ఒక ధైర్యం. భారత సైన్యం అంటే పంజాబ్.. పంజాబ్ అంటే భారత సైన్యం అనేలా ఉంటుంది. అలాంటిది ప్రస్తుతం పంజాబ్ పరిస్థితి అయోమయంగా తయారవుతోంది. ఖలీస్థాన్ ఉద్యమకారుడు అమృత్‌పాల్ సింగ్ తీరు పంజాబ్ ప్రతిష్ఠ మసకబారేలా చేస్తోందని చాలా మంది పంజాబీలు అభిప్రాయపడుతున్నారు. అమృత్‌పాల్ వెనుక రాజకీయ ప్రమేయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ, ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలు దేశ ఉనికికి విఘాతం కలిగిస్తాయి. ఇలాంటి వారిని, ఇలాంటి చర్యలను అణచివేస్తేనే రాబోయే కాలంలో మరోసారి ఇలాంటివి పునరావృతం కావు. కశ్మీర్ ప్రజల్లో మాదిరి విద్వేష భావాలు నాటుకోకముందే, పంజాబ్‌లో ఖలీస్థాన్ చర్యలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నిప్పు కణిక ఇంకో కణికకు నిప్పును అందజేస్తుంది. అలా.. ఒక జ్వాలే తయారవుతుంది. ఈ సూత్రం పాలకులకు తెలియంది కాదు.

అలా అని ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. బుధవారం తెల్లవారుజామున బఠిండా మిలటరీ పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడి ఘటన యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దాడిలో ఉగ్ర కోణం ఉందో, లేదో తెలియదు కానీ, ఏకంగా జవాన్లు ఉండే చోటునే దాడి జరిగింది అంటే అది చిన్న ప్రమాదం కాదు. వాస్తవానికి బఠిండా వ్యూహాత్మకంగా కీలక సైనిక స్థావరం. ఇక్కడ పదో కోర్ కమాండ్‌కు చెందిన దళాలు ఉంటున్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఆర్మీ ఆపరేషన్ యూనిట్లు, కీలక పరికరాలు ఉన్నాయి. అంటే.. ఏ స్థాయిలో భద్రత ఉండాలి? కానీ, దాడి జరిగింది. అంటే.. ఇక్కడి పరిస్థితులపై ఎవరికో పూర్తి అవగాహన ఉన్నట్లే. ఇలాంటివాటిని పెడచెవిన పెడితే పెను ప్రమాదానికి దారితీస్తాయి.

ఖలీస్థాన్ ఉద్యమానికి ఎవరైనా ఆజ్యం పోస్తున్నారా? ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఖలీస్థాన్ మద్దతుదారులు ఉన్నఫలంగా ఎందుకు బయటికి వస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సగటు భారతీయుడి మెదడును తొలుస్తున్నాయి. ఖలీస్థాన్ ఉద్యమం, మిలటరీ పోలీస్ స్టేషన్‌పై దాడులు చూస్తుంటే పంజాబ్‌లో పరిస్థితి చేజారిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. లేకపోతే, పంజాబ్ మరో కశ్మీర్‌లా మారటం ఖాయం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్