తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులు.. స్వరాష్ట్రం సిద్ధించిన తొలిసారి ఇంత దారుణమా?

water problem hyderabad
ప్రతీకాత్మక చిత్రం Photo: Instagram

(ఈవార్తలు-సంపాదకీయం)

తెలంగాణవ్యాప్తంగా స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. ఈ మార్పు ఒకటి, రెండు రంగాలకే పరిమితం కాలేదు. అనేక రంగాల్లో మార్పు కొట్టొచ్చినట్టుగా కండ్లకు సాక్ష్యాత్కరిస్తున్నది. తొమ్మిదేండ్లలో ఎన్నడూ చూడని తాగునీటి తండ్లాట. బంజారాహిల్స్ వీధుల్లో నీళ్ల కోసం కొట్లాట. నీళ్ల ట్యాంకుల మోత. నీళ్లు సరిపోక ప్లాస్టిక్ డ్రమ్ములు కొనేంత వెత. వచ్చిన కొద్దిపాటి నీళ్లు అయిపోగానే, పక్కింటికో, ఎదురింటికో బకెట్లు పట్టుకొని వెళ్లి నీళ్లు అడుక్కోవాల్సిన దుస్థితి. ఇంటి ఓనర్లకు పానీపాట్ల గురించి కిరాయిదారులు చెప్తే మా ఇంట్లో కూడా నీళ్లు లేవు.. మేమెవరికి చెప్పుకోవాలి? ఉంటె ఉండండి లేకుంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి.. అన్న మాటలు. తొమ్మిదేండ్లుగా ఇలాంటి నీటి కటకట చూడలేదు. నీళ్ల ట్యాంకర్ కోసం ఎదురుచూసింది కూడా లేదు. కానీ, నీళ్ల కోసం నిలువెల్లా కన్నులతో ఎదురుచూపులు తప్పడం లేదు. ఇల్లు ఖాళీ చేద్దామంటే మనసొప్పడం లేదు. బకెట్లు పట్టుకొని నీళ్లు అడుక్కోబుద్ధి కావడం లేదు. ది గ్రేట్ బంజారాహిల్స్‌లోనూ కిరాయి కొంపల్లో సామాన్య, సగటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టమైన మార్పు.

నల్లగొండ జిల్లాలో ఓ గ్రామం. పుష్కలంగా సాగునీరు పారకం. జిల్లాలోనే అత్యధిక వరి పండించే తొలి ఐదు గ్రామాల్లో ఒకటి. ఆ గ్రామంలోనూ మార్పు వచ్చింది. ఆ గ్రామంలో ఎండని పొలం లేదు. బాధపడని రైతు లేడు. కొందరివి ఒకటి, రెండు మళ్లు ఎండితే, మరికొందరివి ఎకరా రెండెకరాలు ఎండిపోయాయి. మరికొందరివి మొత్తం ఎండిపోయాయి. 30 ఏండ్లలో ఎన్నడూ ఎండని బోరు సైతం ఈ సారి ఒట్టిపోయింది. చంద్రబాబు హయాంలో ఎండిన ఆ ఊరి బ్రహ్మదేవర చెరువు ఇన్నేండ్లకు మళ్లీ నెర్రెలు వారింది. ఎన్నడూ తాగునీటికి ఇబ్బంది పడని ఆ గ్రామంలో ఇప్పుడు నీళ్ల ట్యాంకర్ కనిపిస్తున్నది. ఇంటింటికీ గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలాంటి నీటి దుస్థితిని ఇంత ఆ గ్రామస్థులు ఎవరూ ఇప్పటివరకు చూడలేదు.

నల్లగొండ పట్టణంలో హోలీ ఆడిన తర్వాత యువతకు ఏఎమ్మార్పీ కాల్వలో ఈత కొట్టడం అలవాటు. ఇన్నాళ్లు సాగిన జలకాలాటకు ఈ సారి బ్రేక్ పడింది. తొమ్మిదేండ్ల తర్వాత తొలిసారిగా కాలువ బంద్ అయింది. ఏఎమ్మార్పీ కాల్వ నీళ్లలేక బోరుమంటున్నది. కాల్వల్లో నీరు పారక మూగజీవాలు తాగునీటిక అల్లాడుతున్నాయి. దీన్ని కాంగ్రెస్ సర్కారు తెచ్చిన మార్పు అనాలా? లేక ఏంటి?

-జ్వాల

వెబ్ స్టోరీస్